Avani Lekhara: తగ్గిన జోరు..! మిక్స్‌డ్‌ షూటింగ్‌లో అవని విఫలం

టోక్యో పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన షూటర్‌ అవనీ లేఖరా అదే జోరును కొనసాగించలేకపోయింది. పది మీటర్ల మిక్సడ్‌ ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో ఆమె విఫలమైంది...

Published : 01 Sep 2021 12:47 IST

దిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన షూటర్‌ అవనీ లేఖరా అదే జోరును కొనసాగించలేకపోయింది. పది మీటర్ల మిక్స్‌డ్‌ ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో ఆమె విఫలమైంది. ఆమెతో పాటు సిద్ధార్థ బాబు, దీపక్‌ కుమార్‌ సైతం అంచనాలు అందుకోలేకపోయారు. దాంతో బుధవారం భారత్‌కు ఇప్పటి వరకు ఒక్క పతకమైనా దక్కలేదు.

రెండు రోజుల క్రితం మహిళల ఆర్‌2 పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాడింగ్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో అవని స్వర్ణం అందుకొన్న సంగతి తెలిసిందే. 249.6 స్కోరు సాధించి ప్రపంచ రికార్డును సమం చేసింది. సరికొత్త ఒలింపిక్‌ రికార్డు సృష్టించింది. పారాలింపిక్స్‌లో తొలి పసిడి అందించిన క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. ఆమె మరో పతకం అందిస్తుందని అందరూ అంచనా వేసినా.. నిరాశపరిచింది.

రైఫిల్‌ ప్రోన్‌ పోటీల్లో అవని తనకు అలవాటు లేని విధంగా 27వ స్థానంలో నిలిచింది. కేవలం 629.7 స్కోరు సాధించి మూడో రౌండ్లో వెనుదిరిగింది. మిగిలిన పారా షూటర్లు సిద్ధార్థ్‌ బాబు, దీపక్‌ కుమార్‌ పురుషుల ఈవెంట్లో మరీ ఘోర ప్రదర్శన చేశారు. 625.5 స్కోరుతో సిద్ధార్థ్‌ 40, 624.9 స్కోరుతో దీపక్‌ 43వ స్థానంలో నిలిచారు. ఫలితంగా భారత్‌ మిక్స్‌డ్‌ టీం ఈవెంట్లో పతకం తేలేకపోయింది.

మహిళల పోటీల్లో జర్మనీకి చెందిన నటాషా హిల్‌ట్రాప్‌ స్వర్ణం, కొరియా అథ్లెట్‌ పార్క్‌ జిన్హో రజతం, ఉక్రెయిన్‌ షూటర్‌ ఇరినా షెట్నిక్‌ కాంస్యం గెలుచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని