Liander Paes - Mahesh Bhupathi:వింబుల్డన్‌ గెలవాలని ఉందా!

వింబుల్డన్‌ గెలవాలని ఉందా..? 16 ఏళ్ల లియాండర్‌ పేస్‌.. తన సహచరుడైన 15 ఏళ్ల మహేశ్‌ భూపతికి వేసిన ప్రశ్న ఇది..! అయితే ఈ కల నెరవేరుతుందని...

Published : 25 Sep 2021 12:46 IST

ముంబయి: వింబుల్డన్‌ గెలవాలని ఉందా..? 16 ఏళ్ల లియాండర్‌ పేస్‌.. తన సహచరుడైన 15 ఏళ్ల మహేశ్‌ భూపతికి వేసిన ప్రశ్న ఇది..! అయితే ఈ కల నెరవేరుతుందని.. తమ జోడీ టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలుస్తుందని భూపతి ఊహించలేదు! కానీ పేస్‌తో అతడి భాగస్వామ్యం అద్భుతాలు చేసింది.. వింబుల్డన్‌ మాత్రమే కాదు ఎన్నో టోర్నీల్లో భారత్‌కు విజయాలను అందించింది. ప్రపంచ అత్యుత్తమ జోడీగా వీరిద్దరి ప్రయాణం ‘బ్రేక్‌ పాయింట్‌’ అనే సిరీస్‌గా రాబోతోంది. మహేశ్‌ భూపతికి తనకు మధ్య ఉన్న సోదరభావం వల్లే కలిసికట్టుగా ఆడి ఎన్నో విజయాలు సాధించగలిగామని..తమ ప్రస్థానాన్ని ఈ సిరీస్‌లో చూడొచ్చని పేస్‌ అన్నాడు. ‘‘భూపతి, నేను ఆటగాళ్లుగా సోదరభావాన్ని సృష్టించుకున్నాం. యువకులుగా ఉన్నప్పుడే జోడీగా మారి.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీని గెలవడం.. ఆపై ప్రపంచ నంబర్‌వన్‌ జంటగా నిలవడం లాంటి అంశాలను ‘బ్రేక్‌ పాయింట్‌’ సిరీస్‌లో మీరు చూడబోతున్నారు. కెరీర్‌ ఆసాంతం దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంత ప్రతిష్టాత్మకంగా భావించామో ప్రేక్షకులు ఈ సిరీస్‌లో చూస్తారు. నేను 16 ఏళ్ల కుర్రాడిగా.. భూపతి 15 ఏళ్ల టీనేజర్‌గా ఉన్నప్పుడు శ్రీలంకలో ఆసియా ఛాంపియన్‌షిప్‌ ఆడిన సందర్భంలో ‘వింబుల్డన్‌ గెలవాలని ఉందా’ అని భూపతిని అడిగాను. అతడు నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత మేం జోడీ కట్టడం.. వరుస విజయాలు సాధించడం చరిత్ర. ఈ సిరీస్‌ మా కెరీర్‌లోని ఎత్తు పల్లాలను చూపిస్తుంది’’ అని పేస్‌ చెప్పాడు. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’గా పేరుబడిన పేస్‌-భూపతి జంట... 1994 నుంచి 2006 వరకు అప్రతిహత విజయాలతో దూసుకెళ్లింది. వింబుల్డన్‌తో పాటు 1999, 2001 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచింది. 2006లో అభిప్రాయ బేధాలతో విడిపోయిన ఈ జంట 2008-2011లో మళ్లీ కలిసింది. ఆ తర్వాత దూరమైన ఈ జోడీ మళ్లీ కలవలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని