KL Rahul - Rohit Sharma: ఎలా ఆడాలో రాహుల్‌, రోహిత్‌ శాసనం చేశారు: అండర్సన్‌

ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎలా ఆడాలో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ చూపించారని ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అన్నాడు....

Published : 14 Aug 2021 14:22 IST

లండన్‌: ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎలా ఆడాలో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ చూపించారని ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అన్నాడు. వారిద్దరూ తమను లెంగ్తులు మార్చుకొనేలా ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. లార్డ్స్‌ మైదానం మరోసారి తనలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీసిందని వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అతడు 1951 తర్వాత ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు.

ఓవర్‌పిచ్‌ అవ్వకుండా సాధ్యమైనంత ఫుల్‌ లెంగ్త్‌ బంతులు వేయాలన్నది తమ ప్రణాళికగా అండర్సన్‌ చెప్పాడు. ‘సాధ్యమైనంత వరకు ఫుల్‌లెంగ్త్‌ బంతులు వేసేందుకు ప్రయత్నించాం. కొద్దిగా గతి తప్పినా సులభంగా డ్రైవ్‌ చేయొచ్చు. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో టీమ్‌ఇండియా ఓపెనర్లు చూపించారు. రాహుల్‌, రోహిత్‌ అద్భుతంగా ఆడారు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. అవసరమైన బంతుల్ని వదిలేశారు. మిగతావి డిఫెండ్‌ చేశారు. ఫుల్‌ లెంగ్త్‌ బంతులు వేసేలా ఒత్తిడి చేశారు. అలా చేయగానే శిక్షించడం మొదలుపెట్టారు’ అని అండర్సన్‌ తెలిపాడు.

రెండో రోజుకు తమకు కాస్త అదృష్టం కలిసొచ్చిందని అండర్సన్‌ అన్నాడు. కేఎల్‌ రాహుల్‌ డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నించడంతో సరైన లెంగ్త్‌ దొరికిందని వెల్లడించాడు. ‘లార్డ్స్‌ నాకెంతో ప్రత్యేకం. ప్రతిసారీ ఇదే చివరిసారి అనుకుంటూ వస్తాను. ఇప్పుడు మాత్రం అలా అనుకోవడం లేదు. ఈ మైదానం నాలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీస్తుంది. ఇక జోరూట్‌ ఎంతో కళాత్మకంగా ఆడాడు. సిరాజ్‌ వేసిన బంతులను అద్భుతంగా డిఫెండ్‌ చేశాడు. ఐదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ తొలి బంతికే ఔటవ్వడం బాధాకరం’ అని అతడు అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని