Lovlina BORGOHAIN: లవ్లీనా ‘కంచు’ పంచ్‌.. పతకం గెలిచిన మూడో బాక్సర్‌గా చరిత్ర

లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది.

Updated : 04 Aug 2021 12:22 IST

సెమీస్‌లో సుర్మెనెలి చేతిలో 0-5తో ఓటమి

టోక్యో: లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’ తర్వాత పతకం ముద్దాడుతున్న రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో ఆమెకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే! ఎందుకంటే భారత బాక్సింగ్‌కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందిస్తోంది. అంతేకాదు.. అరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది.

అంతర్జాతీయ బాక్సింగ్‌లో అంతగా అనుభవం లేని లవ్లీనాకు సెమీస్‌ పోరు సులభం కాదని అందరికీ తెలుసు. ప్రత్యర్థి సుర్మెనెలి (టర్కీ) స్వర్ణ పతకానికి ఫేవరెట్‌! ఈ ఏడాది ఆమె రెండు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. గతంలో మిడిల్‌ వెయిట్‌ (75 కిలోలు) ఆడిన ఆమె ఈ సారి 69కిలోల విభాగంలో తలపడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 16సార్లు పతకాలు కొల్లగొట్టింది. పిడిగుద్దులు, హుక్స్‌, బాడీ షాట్స్‌తో విరుచుకుపడే సుర్మెనెలిపై లవ్లీనా స్ఫూర్తిదాయకంగా పోరాడింది.

సెమీస్‌లో లవ్లీనా 0-5 తేడాతో ఓటమి పాలైంది. వరుసగా మూడు రౌండ్లలో సుర్మెనెలి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. తొలి రౌండ్లో లవ్లీనా కొన్ని పంచులు బాగానే విసిరింది. వాటిని ప్రత్యర్థి తన డిఫెన్స్‌తో అడ్డుకొంది. దాంతో 50-45తో సుర్మెనెలి మొదటి రౌండ్‌ గెలుచుకుంది. ఇక రెండో రౌండ్లో ఆమె మరింత రెచ్చిపోగా లవ్లీనా రక్షణాత్మక ధోరణి కనబరిచింది. ఇక చివరి రౌండ్లో ఆమె మరింత తేలిపోయింది. ఆఖరికి 30-26, 30-26, 30-25, 20-25, 30-25 టర్కీ బాక్సర్‌ ఘన విజయం అందుకుంది. 2008లో విజేందర్‌, 2012లో మేరీకోమ్‌ తర్వాత లవ్లీనా (2021) పతకం అందించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని