Dhoni: ధోనీని మాస్టర్‌ మైండ్‌ అనేది ఇందుకే..!

టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీది మామూలు బ్రెయిన్‌ కాదని, ఆటగాళ్లను బట్టి అప్పటికప్పుడు మైదానంలో ప్రణాళికలు రచించి వాటిని అమలుచేస్తాడని...

Published : 28 Oct 2021 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు మైదానంలో ప్రణాళికలు రచించి వాటిని అమలుచేస్తాడని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ అన్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. చెన్నైతో ఆడేటప్పుడు ఆ జట్టు కెప్టెన్‌ ధోనీ తనని ఎలా కట్టడి చేస్తాడనే విషయాలు ఓ సందర్భంలో నిజాయతీగా పంచుకున్నాడన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడిన స్టాయినిస్‌.. చెన్నైతో బరిలోకి దిగినప్పుడు ధోనీ ఆ జట్టు బౌలింగ్‌, ఫీల్డింగ్‌ను ఎలా సెట్‌ చేస్తాడో తనకు వివరించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

‘ధోనీ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. నేను బరిలోకి దిగినప్పుడు చెన్నై బౌలింగ్‌, ఫీల్డింగ్‌ను ఎలా సెట్‌ చేస్తాడో నాతో చెప్పాడు. అది నాకు రెండు విధాలుగా అనిపించింది. ఒకటి సానుకూలంగా కాంప్లిమెంట్‌ ఇచ్చినట్లుగా.. మరొకటి నన్ను తక్కువ అంచనా వేసినట్లుగా అనిపించింది. కానీ, నేను దాన్ని సానుకూలంగానే తీసుకున్నా. మరోవైపు ధోనీ.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెండు రకాలుగా విభజిస్తాడు. దీంతో ఆటగాళ్లను బట్టి అప్పటికప్పుడు పరిస్థితులకు తగిన విధంగా ప్రణాళికలు రచించి అమలు చేస్తాడు. చివరి వరకూ క్రీజులో ఉండి మ్యాచ్‌లు గెలిపించే ఆటగాళ్లను ఒక రకంగా.. రాగానే రిస్క్‌ తీసుకొని భారీ షాట్లు ఆడే ఆటగాళ్లను మరో రకంగా చూస్తాడు. ఈ క్రమంలోనే నేను చివరి వరకూ క్రీజులో ఉండి మ్యాచ్‌ గెలిపించే ఆటగాడని అర్థం చేసుకున్న ధోనీ ఆ విధంగానే తన జట్టును సెట్‌ చేస్తాడు. అలాగే ఇతరుల విషయంలో ఇలా ఉండడు. రాగానే షాట్లు ఆడే వాళ్లను చూస్తే చెన్నై సారథి మరోలా ప్రణాళికలు అమలు చేస్తాడు’ అని స్టాయినిస్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని