
IND vs ENG: ఐపీఎల్ కోసమే ఆటగాళ్లు భయపడ్డారు: మైఖేల్ వాన్
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దవ్వడంపై ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించాడు. ఈ టెస్టు ద్వారా కరోనా సోకితే తర్వాత ఐపీఎల్ ఆడలేమనే భయంతోనే ఇలా జరిగిందని చెప్పాడు. వాన్ ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
నిజం చెప్పాలంటే ఇదంతా డబ్బు, ఐపీఎల్ కోసమే జరిగిందని, ఈ ఐదో టెస్టు రద్దవ్వడానికి.. ఆటగాళ్లు కరోనా బారిన పడితే ఐపీఎల్ ఆడలేమని భావించారని వాన్ పేర్కొన్నాడు. మరో వారం పది రోజుల్లో మనం ఐపీఎల్ చూస్తుంటాం. అక్కడ ఆటగాళ్లంతా సంతోషంగా తిరుగుతూ కనిపిస్తారు. కానీ, వాళ్ల ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నమ్మాల్సింది. ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనకంతా తెలిసింది. దాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో తెలిసొచ్చింది. మరోవైపు క్రికెటర్లంతా డబుల్ వాక్సిన్ తీసుకున్నారు. దాంతో పాటు పటిష్టమైన బయోసెక్యూరిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది’ అని వాన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
అలాగే ఐదో టెస్టు రద్దవ్వడానికి గల కారణాలు కూడా నమ్మశక్యంగా లేవని ఇంగ్లాండ్ మాజీ సారథి సందేహం వెలిబుచ్చాడు. టెస్టు క్రికెట్‌లో ఇదో ముఖ్యమైన మ్యాచ్ అని, సిరీస్ అద్భుతంగా సాగిందని వాన్ చెప్పుకొచ్చాడు. ఆట ప్రారంభానికి కాస్త ముందే రద్దవ్వడం నమ్మశక్యంగా లేదన్నాడు. మరోవైపు ఈ విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఐదో టెస్టు రద్దవ్వడానికి ఐపీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఇక ఈ సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందంజలో నిలిచింది. చివరి టెస్టు కూడా జరిగి కోహ్లీసేన విజయం సాధించి ఉంటే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించేది.