Dhoni as Mentor: అది మామూలు బుర్ర కాదు.. ధోనీ లాంటి వ్యక్తి ఉండాలి: వాన్‌

వచ్చేనెల జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని జట్టు మెంటార్‌గా నియమించడంపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ హర్షం వ్యక్తం చేశాడు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నా వాన్‌ సానుకూలంగా స్పందించాడు...

Published : 28 Sep 2021 01:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చేనెల జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని జట్టు మెంటార్‌గా నియమించడంపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లో ధోనీ లాంటి దిగ్గజం ఆటగాళ్లతో కలిసి ఉంటే జట్టుకు కలిసి వస్తుందని తెలిపాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ ధోనీ సామర్థ్యంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

‘భారత్‌ అత్యుత్తమ టీ20 సారథిని మెంటార్‌గా నియమించుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుసు. ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అతడి సేవలను ఎందుకు వినియోగించుకోకూడదు? భారత క్రికెట్‌ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పదని నేను భావిస్తున్నా. ధోనీలాంటి వ్యక్తి టీమ్ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండాలి. అతడి లాంటి బుర్ర జట్టుకు ఎంతో అవసరం. మ్యాచ్‌లో పరిస్థితులను అంచనా వేయడంలో అతడు మాస్టర్‌. ట్రైనింగ్‌ సమయంలో, ఆట సమయంలో డగౌట్‌లో అతడు ఉండాల్సిన అవసరం ఉంది. తన నిర్ణయాలు ఎప్పుడూ 90-95 శాతం సరైనవిగా ఉంటాయి’ అని వాన్‌ టీమ్‌ఇండియా మాజీ సారథిపై స్పందించాడు.

ఇదిలా ఉండగా, ధోనీ 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ సెమీఫైనల్స్‌లో జడేజా(77)తో కలిసి ధోనీ(50) రాణించినా భారత్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత కొద్ది నెలలు ఆటకు విశ్రాంతి చెప్పిన మహీ తర్వాత 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే గతేడాది ఐపీఎల్‌లో ఆడినా నిరాశపర్చాడు. అయితే, ప్రస్తుత సీజన్‌లో చెన్నై వరుస విజయాలతో దూసుకుపోతోంది. చూస్తుంటే ధోనీ చెన్నైకి మరో ట్రోఫీ అందించేలా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియాను కూడా టీ20 ప్రపంచకప్‌లో మెరిపించాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని