Mirabai Chanu: మీరాబాయి చాను చెవి‘రింగుల’ కథ తెలుసా?

ఒలింపిక్స్‌లో మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో చరిత్రాత్మక విజయం సాధించి క్రీడా సంబరంలో భారత్‌కు తొలి పతకం అందించింది మీరాబాయి చాను. అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేరుస్తూ.. సగర్వంగా రజత

Updated : 24 Jul 2021 17:16 IST

ఒలింపిక్స్‌ కోసం అమ్మ ఇచ్చిన ‘అదృష్టపు పోగులు’ అవి..

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో చరిత్రాత్మక విజయం సాధించి క్రీడా సంబరంలో భారత్‌కు తొలి పతకం అందించింది మీరాబాయి చాను. అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేరుస్తూ.. సగర్వంగా రజత పతకాన్ని మెడలో వేసుకుంది. ఆ సమయంలో ఆమె కళ్లల్లో మెరిసిన ఆనందంతో పాటు మరో విశేషం కూడా చూపరులను ఆకట్టుకుంది. అది మరేంటో కాదు.. చాను చెవిరింగులు. అచ్చంగా ఒలింపిక్‌ రింగులను పోలిన ఆ చెవిపోగుల వెనుక పెద్ద కథే ఉంది. బిడ్డ కోసం ఓ అమ్మ పడిన శ్రమ, చేసిన త్యాగానికి నిదర్శనం ఈ దుద్దులు. 

అది 2016.. రియో ఒలింపిక్స్‌ కోసం చాను తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ సమయంలో ఆమె తల్లి సైఖోమ్‌ ఓంగ్బీ టాంబీ లైమా చానుకు ఓ అందమైన బహుమతినిచ్చారు. అవే ఒలింపిక్‌ రింగుల్లాంటి ఈ చెవుదుద్దులు. రియో ఒలింపిక్స్‌లో కూతురు పతకం సాధించాలన్న కోరికతో లైమా.. తన బంగారాన్ని అమ్మి, అప్పటిదాకా కూడబెట్టిన సొమ్ము కలిపి ఈ చెవిపోగులను ప్రత్యేకంగా చేయించారు. ఈ రింగులతో తన బిడ్డకు అదృష్టం, విజయం వరించాలని ఆమె కోరుకున్నారు. అయితే ఆ ఒలింపిక్స్‌లో చానుకు ఆ అదృష్టం వరించలేదు గానీ.. నేటి టోక్యో ఒలింపిక్స్‌లో గెలుపు ఆమె సొంతమైంది. ఆ అమ్మ త్యాగానికి ఇప్పుడు ఫలితం లభించింది. 

శనివారం జరిగిన పోటీల్లో 49కేజీల విభాగంలో చాను రెండో స్థానంలో నిలిచి ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని అందుకుంది. ఆ అపురూప క్షణాలను టీవీలో చూసుకుంటూ చాను మాతృమూర్తి సంతోషంతో ఉప్పొంగిపోయారు. టీవీలో ఆ చెవిరింగులు కన్పించగానే ఆనందభాష్పాలు కార్చారు. ‘‘ఈ ఒలింపిక్స్‌లో కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని, లేదంటే కనీసం పతకం అయినా సొంతం చేసుకుంటానని చాను గట్టిగా చెప్పింది. ఆ ఆనంద క్షణాల కోసం మేం ఎంతగానో ఎదురుచూశాం. చాను విజయాన్ని చూసేందుకు మా బంధువులు, మిత్రులు నిన్నే మా ఇంటికి వచ్చారు. అంతా కలిసి బయట టీవీ పెట్టుకుని చూశాం. మా అమ్మాయి గెలవగానే మేమంతా సంతోషంలో మునిగిపోయాం. మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది’’ అని లైమా ఆనందంగా చెప్పుకొచ్చారు.  

అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుని..

పోటీ ప్రారంభానికి ముందు చాను తన ఇంటికి వీడియో కాల్‌ చేసింది. ‘‘దేశం కోసం పతకం సాధించేలా నన్ను ఆశీర్వదించండి’’ అని అమ్మానాన్నను కోరింది. వారి ఆశీర్వాదం, ఎంతో మంది ప్రోత్సాహంతో చాను ఈ రోజు ఈ ఘనత సాధించింది అని ఆమె బంధువులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని