Mohammad Rizwan: టీ20ల్లో సరికొత్త రికార్డు.. ఒకే ఏడాదిలో 2 వేల పరుగులు

పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (2,036) టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 2 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు...

Published : 17 Dec 2021 10:21 IST

కరాచి: పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (2,036) టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 2 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కరాచి వేదికగా గురువారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో ఆ జట్టు సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలోనే ఒషానే థామస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో రిజ్వాన్‌ తొలి బంతిని బౌండరీకి తరలించి టీ20ల్లో ఈ ఏడాది 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

ఇక పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ సైతం ఇదే ఏడాది (1,779) పరుగులు సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ 2015లో.. (1,665) పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 2016లో.. (1,614) పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక భారీ ఛేదనలో పాక్‌ ఓపెనర్లు రిజ్వాన్‌ (87; 45 బంతుల్లో 10x4, 3x6), బాబర్‌ (79; 53 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో టీ20ల్లో మరో  అత్యుత్తమ రికార్డు నెలకొల్పారు. వీళ్లిద్దరూ పొట్టి ఫార్మాట్‌లో ఆరోసారి శతక భాగస్వామ్యాలు జోడించారు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఐదుసార్లు ఈ ఘనత సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని