Shikhar Dhawan: ధావన్‌.. లక్ష్మణ్‌ మోడల్‌ అనుసరించాలి: ఎమ్మెస్కే

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తిరిగి టీ20 క్రికెట్‌లో చోటు దక్కించుకోవాలంటే మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తీరును అనుసరించాలని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు...

Updated : 17 Sep 2021 16:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తిరిగి టీ20 క్రికెట్‌లో చోటు దక్కించుకోవాలంటే మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆట తీరును అనుసరించాలని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్ సూచించారు. తాజాగా ప్రసాద్‌ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వీవీఎస్‌ను టీమ్‌ఇండియా పక్కనపెట్టిన ప్రతిసారీ దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించేవాడని, దాంతో సెలెక్టర్లు అతడిని తీసుకునేవారని ఆయన వివరించారు.

‘ధావన్‌ తిరిగి టీ20 జట్టులో ఆడాలంటే లక్ష్మణ్‌ ఆటతీరునే అనుసరించాలి. వీవీఎస్‌ను జట్టు నుంచి తొలగించినప్పుడల్లా వందల కొద్దీ పరుగులు సాధించి తిరిగి చోటు సాధించేవాడు. ఇప్పుడు ధావన్‌ కూడా అలాగే చేయాలి. అతడి వయసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇకపై ఏ ఫార్మాట్‌ ఆడినా పరుగులు చేస్తానని నిరూపించుకోవాలి. అలా చేస్తే.. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా జట్టులోకి వస్తాడు. అలాగే తన బ్యాటింగ్‌ టెక్నిక్‌లోనూ ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డారు. కాగా, ధావన్‌ ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టీమ్‌ఇండియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, అతడిని రాబోయే టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపిక చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని