INDvsENG: : రూట్‌ కెప్టెన్సీపై మండిపడ్డ నాసర్‌ హుస్సేన్‌

లార్డ్స్‌ వేదికగా టీమ్‌ఇండియాతో జరిగిన రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ ప్రవర్తించిన తీరుపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు ఎదురౌతూనే ఉన్నాయి. తాజాగా ఆ జట్టు మాజీ సారథి నాసర్‌...

Published : 24 Aug 2021 11:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లార్డ్స్‌ వేదికగా టీమ్‌ఇండియాతో జరిగిన రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ ప్రవర్తించిన తీరుపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఆ జట్టు మాజీ సారథి నాసర్‌ హుస్సేన్‌.. రూట్‌ కెప్టెన్సీపై చిటపటలాడాడు. కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదని తీవ్రంగా మండిపడ్డాడు. ఐదోరోజు ఆటలో టీమ్‌ఇండియా టెయిలెండర్లు బుమ్రా(34), షమి(56) నాటౌట్‌గా నిలిచి రికార్డుస్థాయిలో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ పేసర్లు వారిద్దర్నీ ఔట్‌ చేయడానికి చూడకుండా బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూశారు.

ఆ ప్రణాళిక కాస్త బెడిసికొట్టి భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లేలా చేసింది. అంత జరుగుతున్నా రూట్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాడు. దాంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా నాసర్‌ ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో రూట్‌ తీరును ఎండగట్టాడు. ‘అతడికి డ్రెస్సింగ్‌ రూమ్‌లో, ఇంగ్లాండ్‌ అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది. కానీ.. కెప్టెన్సీ అనేది కేవలం పాపులారిటి కాదు’ అని తీవ్రంగా స్పందించాడు. ఎప్పుడు ఎలా ఆడాలో కూడా ఆ జట్టుకు తెలియట్లేదని మాజీ సారథి పేర్కొన్నాడు. రూట్‌ కొన్ని సార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని.. లార్డ్స్‌లో ఐదో రోజు ఉదయం కూడా అలాంటి తికమక నిర్ణయాలే తీసుకున్నాడని నాసర్‌ వివరించాడు. అప్పుడు బుమ్రాతో వివాదం పెట్టుకోకుండా తన బౌలర్లు పరుగులు ఇవ్వకుండా చూడాల్సిందని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని