Neeraj Chopra: ప్రత్యర్థి ఎవరైనా భయపడొద్దు.. క్రీడాకారులకు నీరజ్‌ చోప్రా సూచన

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిసారి అథ్లెటిక్స్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా తగ్గేదేలే అంటున్నాడు. పతకం గెలిచాక సోమవారం భారత్‌కు చేరుకున్న అతడికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్...

Published : 09 Aug 2021 22:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిసారి అథ్లెటిక్స్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా.. ప్రత్యర్థి ఎవరైనా తగ్గేదేలే అంటున్నాడు. పతకం గెలిచాక సోమవారం భారత్‌కు చేరుకున్న అతడికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దిల్లీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చోప్రా మాట్లాడుతూ క్రీడాకారులకు ఓ మంచి సూచన చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదన్నాడు. అందువల్లే తనకీ స్వర్ణం దక్కిందని చెప్పాడు.

‘‘ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో రెండో ప్రయత్నంలో నేను సాధించిన 87.58 మీటర్ల ప్రదర్శన పట్ల ఏదో అత్యద్భుతం చేశానని అనుకున్నా. అది నా కెరీర్‌లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనగా నిలిచిపోతుందని భావించా. ఆ బల్లెం ఎంతో వేగంతో దూసుకెళ్లింది. ఇక పతకం సాధించాక మరుసటి రోజు నా శరీరం మొత్తం నొప్పులతో తల్లడిల్లింది. అది నాకు జరగాల్సిందే. నేను సాధించిన ఈ బంగారు పతకం యావత్‌ దేశానికి అంకితమిస్తున్నా. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకే విషయం చెప్పాలనుకున్నా. మన ప్రత్యర్థి ఎవరైనా భయపడాల్సిన అవసరమే లేదు. మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి. మీరు చెయ్యాల్సిందల్లా ఇదొక్కటే. అందుకు నిదర్శన ఈ స్వర్ణ పతకమే. ప్రత్యర్థిని చూసి ఎప్పుడూ భయపడకండి’’ అని నీరజ్‌ పేర్కొన్నాడు.

ఒలింపిక్స్‌కు ముందు తన పొడవాటి జట్టును ఎందుకు కత్తిరించావని అడిగిన ప్రశ్నకు.. ‘‘నాకు పొడవాటి జుట్టంటే చాలా ఇష్టం. అయితే, దాని వల్లే కలిగే ఇబ్బందుల కారణంగా తొలగించా. అలాంటి జుట్టు ఉంటే స్వేదం ఎక్కువగా వస్తుంది. అందువల్లే చిన్నగా హెయిర్‌కట్‌ చేయించా’’ అని నీరజ్‌ వివరించాడు. ఈ సన్మాన కార్యక్రమానికి పలువురు మంత్రులు, క్రీడాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు దిల్లీ విమానాశ్రయంలోనూ అభిమానులు పెద్ద సంఖ్యలో నీరజ్‌కు ఘన స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని