PAK vs NZ : ఇమ్రాన్‌ హామీ ఇచ్చినా పాక్‌కు షాకిచ్చిన కివీస్‌!

పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ జట్టు ఆఖరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది. భద్రతా కారణాల రిత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది...

Updated : 17 Sep 2021 19:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ జట్టు ఆఖరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆటగాళ్ల భద్రతే తమకు అన్నింటికన్నా ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లను తిరిగి న్యూజిలాండ్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ వైట్‌ వెల్లడించారు.

పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు శుక్రవారం నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే, ఈ రోజు మధ్యాహ్నం రావల్పిండిలో ప్రారంభమవ్వాల్సిన తొలి వన్డే నిర్ణీత సమయానికి మొదలవ్వలేదు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్‌ గదులకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలతో ఈ పర్యటనను విరమించుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ వెల్లడించింది. ఇది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు పెద్ద షాకే అయినా ఆటగాళ్ల భద్రతే తమకు ప్రాముఖ్యమని తేల్చిచెప్పింది.

మరోవైపు ఈ విషయంపై స్పందించిన పీసీబీ.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. తమ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆటగాళ్ల భద్రతపై న్యూజిలాండ్‌ ప్రధానితో మాట్లాడినా వాళ్లు ఇలా ఉన్నపళంగా టోర్నీని రద్దు చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పటికీ తాము షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించింది.

న్యూజిలాండ్‌ నిర్ణయం పట్ల పలువురు క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘న్యూజిలాండ్‌.. పాకిస్థాన్‌ క్రికెట్‌ను చంపేసింది. రావల్పిండి నుంచి బాధాకరమైన వార్త వినాల్సి వచ్చింది’ అని ట్వీట్‌ చేశాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ కూడా న్యూజిలాండ్‌ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తంచేశాడు. ‘న్యూజిలాండ్‌ అర్దాంతరంగా సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం బాధాకరం. ఈ వార్తతో పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు నిరాశకు గురయ్యారు. మా భద్రతా సంస్థల శక్తి సామర్ధ్యాలపై నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. వారు మా దేశానికి గర్వకారణం. మమ్మల్ని వారెప్పుడూ కాపాడుతూనే ఉంటారు. పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అని ట్వీట్‌ చేశాడు. వీరితో పాటు పాక్‌ క్రికెటర్లు మహ్మద్‌ హఫీజ్‌, కమ్రాన్‌ అక్మల్‌ ఇదే రీతిలో స్పందించారు. భద్రతా కారణాలతో టోర్నీ రద్దు చేసుకోవడం వల్ల ఆ దేశంలో జరిగే భవిష్యత్‌ పర్యటనలపైనా ప్రభావం పడుతుందని భారత్‌కు చెందిన వ్యాఖ్యాత హర్షాభోగ్లే, మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని