Kohli - Rohit: ‘క్రీడల కంటే ఎవరూ గొప్పవారు కాదు.. ’

టీమ్‌ ఇండియా జట్టులో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. క్రీడలే అత్యుత్తమమైనవని.. వాటి కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆయన స్పష్టం చేశారు.

Updated : 15 Dec 2021 20:14 IST

విరాట్‌-రోహిత్‌’ వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి

దిల్లీ: టీమ్‌ ఇండియా జట్టులో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. క్రీడలే అత్యుత్తమమైనవని.. వాటి కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆయన స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్‌ కోహ్లీ వన్డే సిరీస్‌ ఆడకపోవడం, మరోవైపు రోహిత్‌ శర్మ టెస్టు సిరీస్‌కు దూరంగా ఉండటం లాంటివి.. జట్టులో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేస్తాయని టీమ్‌ ఇండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ నిన్న ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎవరైనా విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదని, కానీ.. తీసుకునే సందర్భం సరైనదిగా ఉండాలని అజహర్‌ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రిని మీడియా కోరింది.

‘క్రీడలే అత్యుత్తమమైనవి. వాటి కంటే ఎవరూ గొప్పవారు కాదు. ఏ ఆటలో, ఏ ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందో నేను మీకు సమాచారం ఇవ్వలేను. ఇది ఆ ఆటలకు సంబంధించిన సంఘాలు చేయాల్సిన పని. వారు సమాచారం ఇస్తే బాగుంటుంది’ అని అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానమిచ్చారు.

మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్‌ శర్మ ఇప్పటికే గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కోహ్లీ వ్యక్తిగత కారణాల రీత్యా వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై బీసీసీఐ స్పందించింది. తనకు విశ్రాంతి కావాలని కోహ్లీ తమకు అధికారికంగా ఎలాంటి విన్నపం చేయలేదని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని