
IND vs ENG: భారత్ పుంజుకున్నా.. మా ప్లాన్స్ మాకున్నాయి
లండన్: మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమ్ఇండియా తర్వాతి మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్నా.. అందుకు తగ్గట్టే సన్నద్ధమౌతున్నామని ఇంగ్లాండ్ సహాయక కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ అన్నాడు. నాలుగో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్‌లో ఘోర బ్యాటింగ్ వైఫల్యంతో భారత బ్యాట్స్‌మెన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారని, దాంతో రాబోయే టెస్టులో బలంగా పుంజుకునే అవకాశం ఉందని కాలింగ్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే తాము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పాడు.
‘రెండో టెస్టులో మేం అద్భుతమైన బౌలింగ్ చేశామని అనుకుంటున్నా. మీరు టీమ్ఇండియా వీరాభిమాని అయితే ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ను విమర్శించడంలో ఆశ్చర్యంలేదు. కానీ, తొలిరోజు ఆ పిచ్‌పై బంతి అనూహ్యంగా తిరిగింది. వికెట్‌పై తేమ ఉండటంతో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. దాంతో బ్యాట్స్‌మెన్‌కు ఆడటానికి కష్టమైంది. మ్యాచ్ పూర్తయ్యాక టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లాండ్ బౌలర్లను మెచ్చుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం వల్లే భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడ్డారని చెప్పాడు. ఇప్పుడు నాలుగో టెస్టులో ఆ జట్టు బలమైన పోటీ ఇస్తుందా అని అడిగితే.. కచ్చితంగా ఇస్తుందనే మేం అనుకుంటున్నాం. అందుకు తగ్గట్టు సన్నద్ధమౌతున్నాం. టీమ్ఇండియా ఎంత నాణ్యమైన జట్టో మా అందరికీ తెలుసు. తర్వాతి మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు పూర్తిస్థాయిలో రాణిస్తారనే నమ్ముతున్నాం. అలాంటప్పుడు మేం కూడా సిద్ధంగా ఉంటాం’ అని కాలింగ్‌వుడ్ చెప్పుకొచ్చాడు.