PM Modi - PV Sindhu: బల్లెం వీరుడికి చుర్మా.. సింధుకు ఐస్‌క్రీం.. తినిపించిన మోదీ!

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అయ్యారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు...

Updated : 16 Aug 2021 13:39 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మాట నిలబెట్టుకున్నారు! ముందే చెప్పినట్టుగా బ్యాడ్మింటన్‌ తార పీవీ సింధుకు ఐస్‌క్రీం తినిపించారు. ఇక భారతీయుల వందేళ్ల కల నెరవేర్చిన బల్లెం వీరుడు, నీరజ్‌ చోప్రాకు ఆయన చుర్మా రుచి చూపించారు. స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ తన నివాసంలో ఒలింపిక్స్‌ అథ్లెట్లకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. క్రీడాకారుల విజయాలను, వారి కృషిని ప్రశంసించారు.

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు అథ్లెట్లతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి అప్పుడు ప్రస్తావించారు. పీవీ సింధుకు ఐస్‌క్రీం ఇష్టమని తనకు తెలుసన్నారు. పతకం గెలిచి వచ్చాక కలిసి ఐస్‌క్రీం తిందామని స్ఫూర్తినింపారు. అనుకున్నట్టుగానే సింధు టోక్యోలో కాంస్య పతకం అందుకుంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ పతకాలు గెలిచిన భారత ఏకైక మహిళా అథ్లెట్‌గా అవతరించింది.

ఇక బల్లెం వీరుడిగా పేరుపొందిన నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో వ్యక్తిగత స్వర్ణం. అంతేకాకుండా అథ్లెటిక్స్‌లో తొలి పతకం కావడం గమనార్హం. దాంతో ప్రధాని అతడిని ప్రశంసల్లో ముంచెత్తారు.

తన నివాసానికి వచ్చిన అథ్లెట్లను మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఒక్కో అథ్లెట్‌ వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. వారు సాధించిన విజయాలను ప్రశంసించారు. మున్ముందు మరింత బాగా రాణించాలని సూచించారు. ఈ క్రమంలో పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీం తిన్నారు.  నీరజ్‌ చోప్రాకు చుర్మా రుచిచూపించారు. క్రీడాకారులతో కలిసి ఫొటోలు దిగారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని