INDvsSL: బంతి తగలడంతో ఏకాగ్రత కోల్పోయా!

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విఫలమైన అతడిని జట్టు యాజమాన్యం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే...

Published : 19 Jul 2021 04:39 IST

యువ ఓపెనర్‌ పృథ్వీ షా..

(Photo: BCCI Twitter)

కొలంబో: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విఫలమైన అతడిని జట్టు యాజమాన్యం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత తన బ్యాటింగ్‌లోని తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకున్నాడు. ఆపై దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో రాణించి తిరిగి భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో రెచ్చిపోయాడు. అయితే, అతడు ఔటయ్యేముందు ఓవర్‌లో ఒక బంతి హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో తాను ఏకాగ్రత కోల్పోయానని మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు.

శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్య ఛేదనలో పృథ్వీ(43; 24 బంతుల్లో 9x4), శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతుల్లో 6x4, 1x6) ఓపెనింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే పృథ్వీ తొలి ఓవర్‌ నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవర్‌కు రెండు ఫోర్ల చొప్పున ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలోనే చమీరా వేసిన ఐదో ఓవర్‌ చివరి బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. అప్పుడు హెల్మెట్‌ కూడా మెడభాగంలో కొంతవరకు విరిగిపోయింది. వెంటనే ఫిజియోలు వచ్చి పరీక్షించగా అతడికి పెద్ద గాయం అవ్వలేదని నిర్ధారించారు. దాంతో బ్యాటింగ్‌ కొనసాగించిన అతడు మరుసటి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ధనంజయ వేసిన 5.3 ఓవర్‌కు భారీ షాట్‌ ఆడబోయి అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. దాంతో టీమ్‌ఇండియా తొలి వికెట్‌ కోల్పోయింది.

ఇక మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అతడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలనే దాని గురించి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఏమీ చెప్పలేదని అన్నాడు. తన సహజసిద్ధమైన ఆటనే ఆడాలనుకున్నట్లు తెలిపాడు. తనకు స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాలని అనిపించిందని, దాంతో చెత్త బంతుల కోసం వేచి చూసి షాట్లు ఆడానని పేర్కొన్నాడు. ఇక పిచ్‌ కూడా బాగా సహకరించిందని, అదే సమయంలో లంక పేస్‌ బౌలింగ్‌ను ఆస్వాదించానని వివరించాడు. చివరగా చమీరా వేసిన బంతి తలకు తగిలాకే ఏకాగ్రత కోల్పోయినట్లు పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు