Pujara: ‘పుజారాకు తన బ్యాటింగ్‌ వీడియోలు చూపించారా?’.. హిట్‌మ్యాన్‌ జవాబిదీ!

చెతేశ్వర్‌ పుజారాకు బ్యాటింగ్‌ గురించి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని టీమ్ఇండియా ఆటగాడు రోహిత్‌ శర్మ అన్నాడు. ఆటగాళ్లకు కొన్నిసార్లు గడ్డు రోజులు తప్పవని గుర్తుచేశాడు...

Updated : 28 Aug 2021 13:52 IST

లీడ్స్‌: చెతేశ్వర్‌ పుజారాకు బ్యాటింగ్‌ గురించి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని టీమ్ఇండియా ఆటగాడు రోహిత్‌ శర్మ అన్నాడు. ఆటగాళ్లకు కొన్నిసార్లు గడ్డు రోజులు తప్పవని గుర్తుచేశాడు. గతంలో అతడెన్నో విజయాలు అందించాడని, ఓటములు తప్పించాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు.

ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 78కే ఆలౌట్‌ కాగా ఇంగ్లాండ్‌ 432 స్కోరు చేసింది. బదులుగా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కోహ్లీసేన మూడో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కొన్నాళ్లుగా విఫలమవుతున్న చెతేశ్వర్‌ పుజారా (91 బ్యాటింగ్‌; 180 బంతుల్లో 15×4), విరాట్‌ కోహ్లీ (45 బ్యాటింగ్‌; 94 బంతుల్లో 6×4) అజేయంగా నిలిచారు. తన శైలికి భిన్నంగా నయావాల్‌ వేగంగా ఆడుతూ పరుగులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘పుజారాకు తన పాత బ్యాటింగ్‌ వీడియోలు చూపించారా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు రోహిత్‌ జవాబిచ్చాడు.

‘దాదాపుగా 80 టెస్టులు ఆడిన క్రికెటర్‌ గురించి మీరు మాట్లాడుతున్నారు. టెస్టు మ్యాచులకు ముందు అతడికి ఎలాంటి వీడియోలు చూపించాల్సిన అవసరం లేదు. అవును, కొన్నిసార్లు అలాంటివి చూపించాల్సి వస్తుంది. కానీ టెస్టు మ్యాచు కొనసాగుతుండగా నువ్వెలాంటి బ్యాటర్‌వో, నువ్వేం చేయాలో వంటి వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు’ అని రోహిత్‌ అన్నాడు.

‘ఈ ఇన్నింగ్స్‌లో కచ్చితంగా పరుగులు చేయాలన్న సానుకూల ఉద్దేశంతోనే పుజారా బరిలోకి దిగాడు. ఐతే కేవలం మేం మనుగడ కోసమే ఆడటం లేదు. భారీ స్కోరు చేయాలని భావిస్తున్నాం. పుజారా దాన్నే చాటిచెప్పాడు. చెత్త బంతుల్ని వదిలేయనని అతడు చూపించాడు. కొన్నాళ్లుగా అతడు పరుగులు చేయలేదన్నది నిజం. అంతమాత్రాన అతడిలో నాణ్యత తగ్గిందని అనుకోవద్దు. 300+ పరుగుల లోటుతో ఉన్న పరిస్థితుల్లో ఆడటం సులభం కాదని అందరికీ తెలుసు’ అని రోహిత్‌ చెప్పాడు.

‘వ్యక్తిగతంగా చూస్తే పుజారా అదరగొట్టాడు. జట్టు పరంగా అతడింకా చేయాల్సింది చాలానే ఉంది. చివరి రెండు రోజులు మేం బాగా ఆడాలి. ఎప్పటిలాగే అతడు సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడాలి. నిజానికి పుజారా గురించి మేమేం మాట్లాడుకోలేదు. బయట నుంచే విమర్శలు వస్తున్నాయి. కానీ అతడు రెండో టెస్టులో అజింక్యతో కలిసి కీలక భాగస్వామ్యం అందించాడు. ఇక ఆస్ట్రేలియాలో గెలిపించిన సంగతి మర్చిపోవద్దు. కొన్నిసార్లు మనం స్వల్పకాల విషయాలే గుర్తు పెట్టుకుంటాం. ఏళ్ల తరబడి అతడేం చేశాడో మర్చిపోతుంటాం’ అని రోహిత్‌ చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు