Quinton de Kock: టెస్టుక్రికెట్‌కు క్వింటన్‌ డికాక్‌ వీడ్కోలు

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Updated : 31 Dec 2021 05:56 IST

దక్షిణాఫ్రికా: దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నిర్ణయం తక్షణమే అమలు కానున్నట్లు తెలిపాడు. సెంచూరియన్‌లో 113 పరుగుల తేడాతో భారత్‌ చరిత్రాత్మక విజయం సాధించిన కొన్నిగంటలకే డికాక్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు అతని తరఫున క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) నుంచి ప్రకటన వెలువడింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌ను కొనసాగించనున్నట్లు తెలిపాడు. డికాక్‌ ఇప్పటివరకు 54 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 3300 పరుగులు చేశాడు. వాటిలో 6 సెంచరీలు ఉన్నాయి. 

కుటుంబంతో మరింత సమయం గడపడానికే.. 

‘‘ఇది చాలా తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. రిటైర్మెంట్‌ తీసుకోవడానికి చాలా ఆలోచించాను. నాకు నా కుటుంబమే సర్వస్వం. నా భార్య త్వరలో తొలి సంతానానికి జన్మనివ్వబోతున్న సందర్భంగా భవిష్యత్‌ గురించి చాలా ఆలోచించాను. ఈ సమయంలో నా కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాను. నాకు టెస్టు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడాన్ని ఇష్టపడతాను. క్రికెట్‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. కానీ ఇప్పుడు అంతకంటే మరో జీవితాన్ని చూడబోతున్నాను. మొదటి నుంచి ఇప్పటి వరకు నా టెస్టు క్రికెట్‌ ప్రయాణంలో నాతో పాటు కలిసి ప్రయాణించిన నా సహచరులకు ధన్యవాదాలు’’ అని డికాక్‌ పేర్కొన్నాడు.

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి భారత్‌ రికార్డు సృష్టించింది. దీంతో 1-0 తేడాతో భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో డికాక్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు.   

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని