
India vs Srilanka: ద్రవిడ్ వల్లే ఇదంతా.. విజయంలో ఘనత అతడికీ ఇవ్వాలి
ఇంటర్నెట్ డెస్క్: ఎన్‌సీయే చీఫ్ రాహుల్ ద్రవిడ్‌పై పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసల జల్లు కురిపించారు. యువకులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. శ్రీలంకతో రెండో వన్డేలో దీపక్ చాహర్‌ను ముందు పంపించడం ద్రవిడ్ వ్యూహ చతురతకు నిదర్శనమని పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడారు.
‘ద్రవిడ్ కోచింగ్ శైలి బాగుంది. రెండో వన్డే విజయంలో ఘనత ఆయనకూ దక్కాలి. అండర్-19, భారత్-ఏ కోచ్‌గా ఆయన యువకులను తీర్చిదిద్దారు. వారిపై నమ్మకం ఉంచారు. ద్రవిడ్ వల్లే టీమ్‌ఇండియా రిజర్వు బెంచి అత్యంత పటిష్ఠంగా మారింది. మిస్టర్ వాల్ యువ కోచ్‌లా కనిపిస్తారు. దాంతో కుర్రాళ్లు సులభంగా ఆయనతో కలిసిపోతున్నారు. శ్రీలంక సిరీసు కోసం ఆయన కుర్రాళ్లకు చక్కని శిక్షణ ఇచ్చారు. దీపక్ చాహర్ సైతం ఒత్తిడిని ఎదుర్కొని అజేయంగా నిలిచాడు. తిరుగులేని విజయం అందించాడు’ అని రాజా అన్నారు.
అండర్-19, భారత్-ఏ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి పాక్ మాజీ క్రికెటర్లు ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అతడి మార్గనిర్దేశం వల్లే భారత క్రికెట్ జట్టు మరింత దుర్భేద్యంగా మారిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు శ్రీలంకలో భారత జట్టుకు కోచ్‌గా వెళ్లడంతో భవిష్యత్తు భారత కోచ్‌గా అతడిని వర్ణిస్తున్నారు.