Tokyo Olympics: అదరగొట్టిన కుస్తీవీరులు.. క్వార్టర్స్‌కు దీపక్‌, రవి

ఒలింపిక్స్‌ పురుషుల రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. కొలంబియాకు చెందిన టిగ్రరోస్‌పై

Updated : 04 Aug 2021 09:31 IST

టోక్యో: రెజ్లింగ్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. రవి దహియా, దీపక్‌ పునియా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. వీరిద్దరూ ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలు సాధించారు. మరోవైపు మహిళల విభాగంలో అన్షు మలిక్‌ నిరాశ పరిచింది.

రవి కేక

పురుషుల 57 కిలోల విభాగంలో రవి దహియా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన టిగ్రరోస్‌పై 13-2 తేడాతో విజయం సాధించాడు. ప్రత్యర్థి కుడికాలినే లక్ష్యంగా ఎంచుకున్న దహియా వరుసగా పాయింట్లు సాధించాడు. దూకుడుగా ఆడుతూ ఆధిపత్యం చెలాయించాడు. దాంతో న్యాయనిర్ణేతలు అతడిని సాంకేతిక ఆధిపత్యం (టెక్నికల్‌ సుపీరియారిటీ) విధానంలో విజేతగా ప్రకటించారు. ఆట మరో 1.10 నిమిషాలు ఉండగానే అతడు విజేతగా మారాడు. ప్రత్యర్థిని ఐదుసార్లు అతడు టేక్‌డౌన్‌ (ఎత్తిపడేయడం) చేయడం గమనార్హం. తర్వాతి పోరులో బల్గేరియాకు చెందిన జార్జి వలెటినోవ్‌తో అతడు తలపడనున్నాడు.

మెరిసిన దీపక్‌

మరో రెజ్లర్‌ దీపక్‌ పునియా సైతం 86 కిలోల విభాగంలో దుమ్మురేపాడు. సాంకేతిక ఆధిపత్యంతోనే క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. నైజీరియాకు చెందిన అజియోమొర్‌ ఎకెరెకెమిని 12-1 తేడాతో చిత్తుగా ఓడించాడు. తొలి పిరియడ్‌లో 4 పాయింట్లు అందుకున్న పునియా రెండో పిరియడ్‌లో మరింత చెలరేగాడు. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. వరుసగా 1, 2, 1, 2, 2 పాయింట్లు సాధించాడు. మరో 50 సెకన్ల సమయం ఉండగానే క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. తర్వాతి పోరులో అతడు చైనా కుస్తీవీరుడు లిన్‌ జుషెన్‌తో తలపడతాడు.

నిరాశపరిచిన అన్షు

మహిళల 57  కిలోల విభాగంలో అన్షు మలిక్‌ పరాజయం పాలైంది. బెలారస్‌కు చెందిన కురచ్‌కినా ఇరినా చేతిలో 2-8 తేడాతో ఓటమి పాలైంది. తొలి పిరియడ్‌లో అన్షు అసలు పాయింట్లే సాధించలేదు. ప్రత్యర్థి మాత్రం 5 పాయింట్లతో ఆధిపత్యం చెలాయించింది. రెండో పిరియడ్‌లో అన్షు 2 పాయింట్లు సాధించినా ప్రత్యర్థి 4 పాయింట్ల అందుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని