Ravi Shastri: అశ్విన్‌ను బాధపెట్టి ఉంటే.. అందుకు సంతోషమే: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తన మాటలు బాధపెట్టి ఉంటే అందుకు సంతోషంగా ఉందని మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు...

Updated : 24 Dec 2021 10:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తన మాటలు బాధపెట్టి ఉంటే అందుకు సంతోషమేనని  మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా 2-1 తేడాతో తొలిసారి ఆ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంది. అయితే, సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ 5 వికెట్ల ప్రదర్శన చేయడంపై రవిశాస్త్రి ఆరోజు మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో తమ తొలి ప్రాధాన్య స్పిన్నర్‌ అతడేనని పేర్కొన్నాడు. కాగా, ఆ టెస్టులో చోటు దక్కని అశ్విన్‌ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. శాస్త్రి మాటలు కలచివేశాయని, తనని బస్‌కింద తోసేసినట్లు అనిపించిందని ఇటీవల ఓ క్రీడాఛానల్‌తో వాపోయాడు. ఈ నేపథ్యంలో శాస్త్రి స్పందిస్తూ ఇలా బదులిచ్చాడు.

‘ఆ మ్యాచ్‌లో అశ్విన్‌ ఆడలేదు. కానీ, కుల్‌దీప్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కాబట్టి నేను అతడిని ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. నేనెలా చేయడం వల్లే అశ్విన్‌ మళ్లీ తన ఆటపై దృష్టిసారించి.. కొత్తగా ప్రయత్నించి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఎలాంటి భేషజాలు లేకుండా నిజాలు చెప్పడమే నా పని. అంతేకాని, ప్రతి ఒక్కరికీ వెన్న పూయడం కాదు. ఒక కోచ్‌ మిమల్ని పరీక్షిస్తే ఏం చేస్తారు? ఇంటికెళ్లి ఏడ్చుకుంటూ కూర్చొని నేను మళ్లీ ఆడను అంటారా? ఒక ఆటగాడిగా నేనైతే సవాళ్లను స్వీకరించి మెరుగవుతా. అలా నా కోచ్‌ చెప్పిన మాటలు తప్పని నిరూపించుకుంటా. కుల్‌దీప్‌ పట్ల నేను చేసిన వ్యాఖ్యలకు అశ్విన్‌ బాధపడి ఉంటే.. అందుకు నేను సంతోషిస్తున్నా. అందువల్లే అతడు సాధన చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు’ అని మాజీ కోచ్‌ అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉండగా, ఆ సిడ్నీ టెస్టు తర్వాత కుల్‌దీప్‌ సరైన ప్రదర్శన చేయలేక జట్టులో చోటు కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు. మరోవైపు అశ్విన్‌ తన ఆటను మెరుగుపర్చుకొని బాగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్న హర్భజన్‌ సింగ్‌ (417 వికెట్లు) రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం 427 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్‌ రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లో మరో 8 వికెట్లు పడగొడితే కపిల్‌ దేవ్‌ (434)ను కూడా దాటిపోతాడు. దీంతో 619 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అనిల్‌కుంబ్లే  తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకునే అరుదైన అవకాశం ముందుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని