
Ashwin: అప్పుడు బస్‌కింద తోసేసినట్లు అనిపించింది: అశ్విన్
రవిశాస్త్రి.. కుల్‌దీప్‌యాదవ్‌ను నంబర్ 1 అనడం తట్టుకోలేకపోయా..
ఇంటర్నెట్‌డెస్క్: 2018-2019 సీజన్‌లో మణికట్టు స్పెషలిస్టు కుల్‌దీప్ యాదవ్‌ను అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రి.. విదేశాల్లో భారత్ తరఫున నంబర్ వన్ బౌలర్ అని ప్రశంసించడం తట్టుకోలేకపోయానని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వాపోయాడు. అప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టులో కుల్‌దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఆ విషయంపై తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన అశ్విన్ తన బాధను వివరించాడు.
‘నేను రవిశాస్త్రిని అమితంగా గౌరవిస్తా. మనలో ఎవరైనా కొన్నిసార్లు ఏదో ఒకటి మాట్లాడి తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకుంటామని తెలుసు. కానీ, ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. అయితే, వ్యక్తిగతంగా కుల్‌దీప్ ప్రదర్శన పట్ల నేనెంతో సంతోషించాను. ఆసీస్‌లో నాకు ఐదు వికెట్లు దక్కకపోయినా అతడికి దక్కాయని ఆనందించాను. అదెంత గొప్ప విషయమో నాకు తెలుసు. అది అభినందించాల్సిన విషయం కూడా. అంతకుముందు నేను ఆస్ట్రేలియాలో ఎన్నిసార్లు బౌలింగ్ చేసినా ఎప్పుడూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదు. అందుకే మనస్ఫూర్తిగా అతడి పట్ల సంతోషంగా ఉన్నా’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
‘ఇక సిరీస్ గెలిచాక నేను పార్టీలో పాల్గొనడానికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే నేను ఆ పార్టీలో భాగస్వామి అవ్వాలంటే.. ఆ విజయంలో నాపాత్ర కూడా ఉండాలని అనుకుంటా. అలా కాకుండా నన్ను బస్ కిందపడేసినట్లు అనిపిస్తే ఎలా ఉంటా? జట్టు విజయాన్ని ఎలా ఆస్వాదిస్తా? అక్కడి నుంచి నా గదికెళ్లి భార్య, కుమార్తెలతో మాట్లాడా. తర్వాత మళ్లీ మనసు మార్చుకొని జట్టు సంబరాల్లో పాల్గొన్నా. ఎందుకంటే అది ఒక చారిత్రక విజయం’ అని అశ్విన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అలాగే ఈ సిరీస్ తర్వాత చాలాసార్లు ఆటకు వీడ్కోలు చెప్పాలనుకున్నట్లు కూడా అశ్విన్ చెప్పాడు. తాను గాయాలపాలైనప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, జట్టుకు ఎన్నో విజయాలు అందించిన తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందని బాధపడినట్లు తెలిపాడు. తాను సహజంగా ఎవరి సాయం కోరనని, కానీ.. అప్పుడు తనకు అండగా ఒకరు ఉంటే బాగుండేదని అనిపించిందని అశ్విన్ వివరించాడు.
► Read latest Sports News and Telugu News