
Ravindra Jadeja: నిజమైన స్నేహితులు కానివారు అబద్ధాలు నమ్ముతారు : జడేజా
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా స్పందించాడు. అవన్నీ పుకార్లని స్పష్టం చేశాడు. నిజమైన స్నేహితులు మనల్ని నమ్ముతారని, అలా కానివారు మాత్రమే మన గురించి అబద్ధాలను విశ్వసిస్తారని చెప్పాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా జడేజా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం పెట్టారు.
అయితే, అతడి గాయం పెద్దదని, దానికి శస్త్రచికిత్స అవసరమని, అనంతరం కోలుకోవడానికి కూడా కొన్ని నెలల సమయం పడుతుందని ఓ పత్రికలో వార్తలు వచ్చాయి. అతడు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొని పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టిసారించనున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో జడేజా స్పందిస్తూ .. రెండు ట్వీట్లు చేశాడు. ఒక ట్వీట్‌లో టెస్టు జెర్సీ ధరించిన ఫొటో పంచుకొన్న అతడు.. ఈ ఫార్మాట్‌లో తాను ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉందని పరోక్షంగా చెప్పాడు. దీంతో అతనిపై వచ్చిన పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. మరోవైపు ఈనెల 26 నుంచి టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో మూడు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటగాళ్లంతా గురువారం ఉదయం దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు.