Dhoni: ధోనీ ఆ మాట చెప్పేసరికి.. అంతా షాకయ్యారు : రవిశాస్త్రి

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ఒక నిర్ణయం తీసుకొని జట్టు సభ్యులనే కాకుండా యావత్‌ భారత క్రికెట్‌ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశాడు...

Updated : 27 Dec 2021 15:02 IST

2014 ఆస్ట్రేలియా పర్యటనలో ఏం జరిగిందంటే..?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ఒక నిర్ణయం తీసుకొని జట్టు సభ్యులనే కాకుండా యావత్‌ భారత క్రికెట్‌ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అప్పుడు మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియా మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం ధోనీ జట్టు సభ్యులతో మాట్లాడుతూ చాలా క్యాజువల్‌గా టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పాడు. దీంతో టెస్టు సారథ్య బాధ్యతల్ని విరాట్‌ కోహ్లీకి అప్పగించారు. ఇదే విషయాన్ని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తాజాగా ఓ క్రీడా ఛానల్‌లో వివరించాడు. అసలు ఆ రోజు డ్రెస్సింగ్‌రూమ్‌లో ఏం జరిగిందనే విషయాన్ని పంచుకున్నాడు.

‘టీమ్‌ఇండియా తర్వాతి సారథిగా ఎవరు కొనసాగుతారనే విషయం అప్పటికే ధోనీకి అర్థమైంది. దాంతో తన నిర్ణయాన్ని ప్రకటించడానికి సరైన సమయం కోసం ఎదురుచూశాడు. ఎందుకంటే తన శరీరం ఇకపై ఏమేరకు సహకరిస్తుందనే విషయంపై ఒక అవగాహనకు వచ్చాడు. తన కెరీర్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పొడిగించాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు.  ధోనీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇక రెండో ఆలోచనే ఉండదు. మెల్‌బోర్న్‌ మ్యాచ్‌ అయ్యాక నా వద్దకొచ్చి ఆటగాళ్లందరితో మాట్లాడాలని చెప్పాడు. నేను ఓకే చెప్పి.. అందర్నీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సమావేశపరిచా. ఆ మ్యాచ్‌ డ్రా చేసుకున్నందుకు ఏదైనా చెప్తాడేమోనని అనుకున్నా. కానీ, చాలా తేలిగ్గా టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పాడు. వెంటనే నేను అందరి వైపు చూశాను. అంతా షాకయ్యారు’ అని అప్పుడు జట్టు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని