Tokyo olympics: ఇంత నీచమా? వందనను కులం పేరుతో దూషిస్తారా.. రాణి రాంపాల్‌ ఆవేదన

మహిళల హాకీ జట్టు సభ్యురాలు వందనా కటారియా కుటుంబాన్ని కులం పేరుతో దూషించడాన్ని కెప్టెన్‌ రాణి రాంపాల్‌ ఖండించింది. తమకు కులమతాలతో పట్టింపు లేదని స్పష్టం చేసింది...

Published : 07 Aug 2021 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల హాకీ జట్టు సభ్యురాలు వందనా కటారియా కుటుంబాన్ని కులం పేరుతో దూషించడాన్ని కెప్టెన్‌ రాణి రాంపాల్‌ ఖండించింది. తమకు కులమతాలతో పట్టింపు లేదని స్పష్టం చేసింది. తామంతా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని వెల్లడించింది. ఆట కోసం క్రీడాకారులు చేసిన త్యాగాలను గుర్తించాలని, దూషణలకు దిగడం నీచమని ఘాటుగా స్పందించింది.

ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అంచనాలను మించి రాణించిన సంగతి తెలిసిందే. కాంస్యం కోసం జరిగిన పోరులో బ్రిటన్‌ చేతిలో త్రుటిలో పరాజయంపాలయింది. అంతకన్నా ముందు అర్జెంటీనాతో సెమీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి చవిచూసింది. జట్టు ఓడిపోయిందన్న నెపంతో కొందరు వందనా కటారియా ఇంటి వద్దకు వచ్చి ఇబ్బంది కలిగించారు. కులం పేరుతో వారిని దూషించారు.

‘వందన కుటుంబానికి జరిగింది విన్నాక బాధేసింది. ఆమె తండ్రి ఈ మధ్యే మరణించారు. అథ్లెట్ల భావోద్వేగాలు, వారు చేసే త్యాగాలను కొందరు అర్థం చేసుకోవడం లేదు. ఒలింపిక్స్‌ ముందు సాధన వదలకూడదని ఆమె తండ్రి అంత్యక్రియలకూ హాజరవ్వలేదు. కానీ జనాలు ఎందుకిలా చేస్తున్నారో తెలియదు’ అని రాణి తెలిపింది.

‘దేశంలోని వేర్వేరు ప్రాంతాలు, కులాలు, మతాల నుంచి మేం వచ్చాం. టోర్నీలో మేం దేశం, జాతీయ పతాకానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాం. అందుకే ఇలాంటివి చేయొద్దని ప్రజలను కోరుతున్నా. దేశానికి పేరు తెచ్చేందుకు క్రీడాకారులు ప్రాణాలు ఇస్తారు. వారి పట్ల అనైతికంగా ప్రవర్తించకండి’ అని రాంపాల్‌ హితవు పలికింది.

‘ఇలాంటివి క్రీడాకారుల గుండె పగిలేలా చేస్తాయి. వీటి నుంచి కోలుకోవడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ అథ్లెట్లు కోలుకున్నా కుటుంబ సభ్యులు అంత సులభంగా సాధారణ స్థితికి రాలేరు. అథ్లెట్లు గెలిచినా ఓడిపోయినా మీ అందరి మద్దతు ఉండాలనే మేం కోరుకుంటున్నాం. అలాంటప్పుడే దేశం క్రీడారంగంలో ముందుకు వెళ్లగలదు. ఏదేమైనా మా ప్రదర్శనకు తగిన ప్రశంసలు లభిస్తున్నాయి. అందుకు సంతోషంగా ఉంది’ అని రాణి రాంపాల్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని