Rewind 2021: ఈ ఏడాది క్రీడల్లో ‘క్లిక్’ అయ్యింది వీళ్లే..!
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
2021లో క్రీడాభారతం చరిత్ర సృష్టించింది.. వందేళ్ల కలను సాకారం చేసుకొంది.. ఎంతో మంది కొత్త సూపర్ స్టార్లను దేశానికి ఇచ్చింది.. ఒలింపిక్స్‌లో ఎన్నడూ లేనన్ని పతకాలను అందించింది.. భారత్‌లో చిన్నచూపునకు గురైన క్రీడలు పూర్వవైభవాన్ని అందుకొన్నాయి.. క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి వాటిల్లో ఎప్పటిలానే తన హవాను కొనసాగించింది. మొత్తంగా 2021 సగటు క్రీడాభిమానికి కొన్నేళ్లపాటు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా మిగిలింది.
* నీరజ్ చోప్రా: (జావెలిన్ త్రో - స్వర్ణం):
125 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో భారత్ గతంలో ఒక్క గోల్డ్ మెడల్ మాత్రమే దక్కించుకుంది. 2008లో అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో సాధించారు. అప్పుడు యావత్ దేశం పులకించిపోయింది. అయితే, ఈ ఏడాది నీరజ్ చోప్రా జావెలిన్ త్రో (ట్రాక్ అండ్ ఫీల్డ్)లో అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణాన్ని ముద్దాడి భారత చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ పోటీల్లో నీరజ్ ఆది నుంచి ఆధిపత్యం చలాయించాడు. ఫైనల్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి చరిత్ర సృష్టించాడు. భారత్ ఈ జులపాల కుర్రాడిని చూసి మురిసిపోయింది. సైన్యంలో సుబేదార్‌గా పనిచేస్తున్న నీరజ్ సూపర్ స్టార్ హోదాలో కూడా చాలా హుందాగా వ్యవహరించాడు. పాకిస్థాన్ జావెలిన్ క్రీడాకారుడిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా.. అతడిని సమర్థించి పెద్దమనసు నిరూపించుకొన్నాడు.
* మీరాబాయి చాను (రజతం- వెయిట్ లిఫ్టింగ్):
ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన తొలి అథ్లెట్ మీరాబాయి చాను. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజతం సాధించిన ధీర వనిత. కరణం మల్లీశ్వరి తర్వాత మన దేశానికి వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం అందించిన ఘనత మీరాబాయికే దక్కింది. ఈ విభాగంలో చైనా క్రీడాకారిణి హు జిహుయి 210 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక మీరాబాయి 202 కిలోలతో రెండో స్థానంలో నిలిచి రజతంతో మెరిసింది. దీంతో ఆమె తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించి చిరునవ్వుతో తిరిగొచ్చింది.
* రవికుమార్ దహియా (రెజ్లింగ్ - రజతం):
ఈ ఒలింపిక్స్‌లో పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా ఫైనల్స్‌లో బంగారు పతకం సాధిస్తాడని ఆశించినా నెరవేరలేదు. రష్యాకు చెందిన యుగేవ్ జావుర్ చేతిలో రవికుమార్ తుదిపోరులో ఓటమిపాలయ్యాడు. పురుషుల రెజ్లింగ్ విభాగంలో 2012లో సుశీల్‌కుమార్ తర్వాత రవికుమార్ భారత్‌కు పతకం అందించాడు. సుశీల్ పర్యవేక్షణలోనే రవి శిక్షణ సాగటం గమనార్హం. రవి పోటీల్లో పాల్గొనే నాటికి సుశీల్ ఓ కేసులో అరెస్టయ్యారు. పతకం గెలిచిన అనంతరం రవి ఓ టీవీ ఇంటర్వ్యూలో సుశీల్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపి ఆకట్టుకొన్నారు.
* పీవీ సింధు: (బ్యాడ్మింటన్ - కాంస్యం):
భారత బ్యాడ్మింటన్ క్రీడలో మన తెలుగు తేజం పీవీ సింధుకు ఎంతటి ఘన చరిత్ర ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్ హోదాతో ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆమె కాంస్యంతో తిరిగొచ్చింది. 2016 ఒలింపిక్స్‌లో ఆమె రజతం సాధించింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో పతకాలు సాధించిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. అయితే, ఇటీవల ముగిసిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఓటమిపాలై నిరుత్సాహపరిచింది.
* లవ్లీనా బార్గొహెయిన్ (బాక్సింగ్ - కాంస్యం):
ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున బాక్సింగ్‌లో పతకం సాధించిన మూడో బాక్సర్‌గా లవ్లీనా బొర్గొహెయిన్ రికార్డులకెక్కింది. సెమీస్‌లో టర్కీ బాక్సర్ సుర్మెనెలి చేతిలో 0-5 తేడాతో ఓటమిపాలైంది. దీంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే 2012లో మేరీకోమ్ తర్వాత బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకాన్ని అందుకొన్న మహిళగా కీర్తి సాధించింది. అలాగే అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే లవ్లీనా పతకం సాధించడం మరో గర్వకారణం.
* భారత హాకీ జట్టు (కాంస్యం):
41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో జర్మనీతో తలపడిన 5-4 తేడాతో గెలిచింది. దీంతో 1980 తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తొలిసారి పతకం సాధించింది. దీంతో భారత హాకీ జట్టు మునుపటిలా రాణించేందుకు సరైన బాటలు వేసుకుంది.
* భజ్‌రంగ్ పూనియా (రెజ్లింగ్ - కాంస్యం):
పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో యువ రెజ్లర్ భజ్‌రంగ్ పూనియా కాంస్యం సాధించాడు. కజకిస్థాన్ రెజ్లర్ దౌలెత్ నియాజ్‌బెకోవ్‌తో ప్లేఆఫ్స్ పోరులో తలపడి 8-0 తేడాతో గెలుపొందాడు. దీంతో ఈసారి అరంగేట్రంలోనే పతకం సాధించిన మూడో అథ్లెట్‌గా నిలిచాడు. అలాగే ఈ పతకంతో భారత్ ఈసారి ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు కైవసం చేసుకొంది. దీంతో 2012లో సాధించిన అత్యధిక పతకాల సరసన నిలిచింది.
* రుతురాజ్ గైక్వాడ్:
క్రికెట్‌లో టీమ్‌ఇండియా యువ కెరటం రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాదిని ఎప్పటికీ మర్చిపోడు. జాతీయ జట్టుకు ఎంపికై.. ఆ తర్వాత రాణించి భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్నాడు. తొలుత ఏప్రిల్‌లో భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌లో రాణించాడు. ఆ తర్వాత శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియాకు ఎంపియ్యాడు. ఇక్కడ బ్లూ జెర్సీలో అరంగేట్రం చేసి.. ఆపై మళ్లీ దుబాయ్‌లో నిర్వహించిన ఐపీఎల్‌లో కూడా కదంతొక్కాడు. ఫలితంగా ఈ సీజన్‌లో 635 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగోసారి ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలోనూ పరుగుల వరద పారించి.. నాలుగు శతకాలు చేశాడు. దీంతో రుతురాజ్ ఈ ఏడాదిని సంపూర్ణ విజయాలతో పూర్తి చేసుకున్నాడు.
* వెంకటేశ్ అయ్యర్:
ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్. బయోబబుల్‌లో కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సగం సీజన్ యూఏఈకి తరలిపోయిన సంగతి తెలిసిందే. ఈ కోల్‌కతా ఓపెనర్‌కి అక్కడ అదృష్టం కలిసొచ్చింది. భారత్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన వెంకటేశ్‌ను ఆ జట్టు యాజమాన్యం యూఏఈలో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా బరిలోకి దింపింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో 41 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫలితంగా కోల్‌కతా జట్టులో ఓపెనర్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు పార్ట్‌టైమ్ బౌలర్‌గానూ జట్టుకు సేవలందించడం విశేషం. ఈ క్రమంలోనే ఐపీఎల్ రెండో అంచెలో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి 370 పరుగులు చేశాడు. కోల్‌కతా ఫైనల్‌కు చేరడంలో వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. చివరికి టీ20 ప్రపంచకప్ అనంతరం న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపికై ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు.
* హర్షల్ పటేల్:
ఈసారి ఐపీఎల్‌లో రాణించిన మరో ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్. కొన్నేళ్లుగా ఈ మెగా ఈవెంట్‌లో ఆడుతున్నా అతడికి ఈ ఏడాది వచ్చినంత ఫేమ్ ఎప్పుడూ రాలేదు. అందుకు కారణం హర్షల్ ఈ సీజన్‌లో అత్యధికంగా 32 వికెట్లు తీసి రికార్డు సృష్టించడమే. అయితే, అతడు ఈ ఘనత సాధించడానికి ముందు ఒకసారి ఇబ్బందికర పరిస్థితి సైతం ఎదుర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో హర్షల్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో 37 పరుగులు సాధించాడు. అయితే, దీని నుంచి త్వరగా కోలుకున్న బెంగళూరు పేసర్.. మిగతా మ్యాచ్‌ల్లో విశేషంగా రాణించాడు. చివరికి 2012లో డ్వేన్‌బ్రావో సాధించిన అత్యధిక వికెట్ల రికార్డును సమం చేశాడు. హర్షల్ అలా ఐపీఎల్‌లో మెరవడమే కాకుండా ఇటీవల టీ20 ప్రపంచకప్ అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు సైతం ఎంపికయ్యాడు.
* సూర్యకుమార్ యాదవ్:
కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో వరుసగా రాణిస్తున్నా.. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో స్థానం దక్కకపోవడంతో సూర్యకుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అయితే, ఈ ఏడాదిని ఆశాజనకంగా ముగించడం గమనార్హం. 2021 ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ రెండు టీ20ల్లో 57, 32 స్కోర్లతో ఆకట్టుకొన్నాడు. ఆపై టీమ్‌ఇండియా తరఫున మూడు వన్డేలు, 11 టీ20లు ఆడి ఈ ఏడాదిని ముగించాడు.
* ఇషాన్ కిషన్:
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దంచి కొట్టడమే లక్ష్యంగా ఆడే ఆటగాడు ఇషాన్‌కిషన్. సూర్యకుమార్ లాగే ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీంతో తొలి మ్యాచ్‌లోనే బ్యాట్ ఝుళిపించి 56 పరుగులతో సత్తా చాటాడు. అలా ఈ ఏడాది టీమ్‌ఇండియా తరఫున మొత్తం రెండు వన్డేలు, 5 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఇషాన్ తన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సఫలీకృతమయ్యాడు. ఇషాన్ కీపింగ్ కూడా చేయడం విశేషం. ప్రస్తుతం టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిషభ్ పంత్ ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నా అవసరమైన సమయంలో ఇషాన్ కూడా పనికొస్తాడు. దీంతో ఈ యువ బ్యాట్స్‌మన్ ఈ ఏడాదిని తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుపుకొన్నాడు.
* ఇలా ఈ ఏడాది భారత క్రీడా చరిత్రలో పలువురు క్రీడాకారులు తమకంటూ ఓ ప్రత్యేకత సాధించారు. ఇక ముందు కూడా వీళ్లంతా ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్.. ఛాంపియన్స్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
TSRTC: ఆర్టీసీకి భారీ గి‘రాఖీ’.. రికార్డు స్థాయిలో వసూళ్లు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలు.. వరుస సెలవులతో అనూహ్య రద్దీ
-
Ap-top-news News
Hindupuram: హిందూపురంలో ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ రెడీ..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!