Joe Root: అవును.. మేం టీమ్‌ఇండియాను తక్కువ అంచనా వేశాం!

రెండో టెస్టులో వ్యూహాత్మక తప్పిదాలు చేశామని ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ అన్నాడు.  టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ను తక్కువ అంచనా వేశామని అంగీకరించాడు. ...

Updated : 17 Aug 2021 14:39 IST

లండన్‌: రెండో టెస్టులో వ్యూహాత్మక తప్పిదాలు చేశామని ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ అన్నాడు.  టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ను తక్కువ అంచనా వేశామని అంగీకరించాడు. జస్ప్రీత్‌ బుమ్రా (34*), మహ్మద్‌ షమి (56*) తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని స్పష్టం చేశాడు.

‘కెప్టెన్‌గా నేను పొరపాట్లు చేశాను. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేయాల్సింది. షమి, బుమ్రా భాగస్వామ్యం మ్యాచులో కీలకమనడంలో సందేహం లేదు. వారిని నేను అడ్డుకోలేకపోయాను. దాంతో మా జట్టు కష్టాల్లో పడింది. మేం తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆడనందుకు నిరాశపడుతున్నా. లోయర్‌ ఆర్డర్‌ డిఫెన్స్‌ను అంచనా వేయడంలో పొరపడ్డాను’ అని రూట్‌ అన్నాడు.

షమి, బుమ్రాపై ప్రయోగించిన షార్ట్‌ బంతుల వ్యూహం విఫలమైందని రూట్‌ తెలిపాడు. ‘నిజానికి మేం స్టంప్స్‌కు నేరుగా దాడి చేస్తూ షార్ట్‌ పిచ్‌ బంతులతో ఆశ్చర్యపరిస్తే బాగుండేదేమో! ఏదేమైనా వారిద్దరికీ ఘనత ఇవ్వాల్సిందే. వారు భిన్నమైన ప్రాంతాల్లో పరుగులు చేయడంతో ఫీల్డర్లను సరిగ్గా మోహరించలేక పోయాను. ఇక ముందు మేం మరిన్ని వ్యూహాలతో వచ్చి వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాం’ అని అతడు పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా దూకుడులో తప్పేమీ లేదని రూట్‌ స్పష్టం చేశాడు. ‘విరాట్‌ తన సహజ శైలిలోనే ప్రవర్తించాడు. అతడితో పోలిస్తే నాది భిన్నమైన ఆటతీరు. విరాట్‌ సేన నిజాయతీగానే ఆడింది. వారు ఎక్కువ భావోద్వేగం చెందారు. వ్యూహాత్మకంగా రాణించారు. అవకాశాలను టీమ్‌ఇండియా ఒడిసిపట్టింది. నాకు తెలిసినంత వరకు మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదాలేమీ జరగలేదు. విద్వేషం ప్రదర్శించలేదు’ అని అతడు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని