
IPL 2021: ధోనీ భాయ్ వెన్నంటి ఉంటే.. ఎక్కువ ఆలోచించాల్సిన పనిలేదు: రుతురాజ్
(Photo: Ruturaj Gaikwad Instagram)
ఇంటర్నెట్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ, జట్టు యాజమాన్యం కలిసి ప్రోత్సహిస్తే ఇక దేని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. గతరాత్రి ముంబయితో తలపడిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడు జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నైని రుతురాజ్(88*) ఆదుకున్నాడు. జడేజా(26), బ్రావో(23)తో కలిసి మంచి భాగస్వామ్యాలు నిర్మించాడు. ఈ క్రమంలోనే 20 ఓవర్లకు జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ కెప్టెన్ ధోనీ, జట్టు యాజమాన్యం ప్రోత్సహిస్తే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. ఇది కచ్చితంగా తన టాప్ ఇన్నింగ్స్‌ల్లో ఒకటని అన్నాడు. ఆదిలోనే పలు వికెట్లు కోల్పోయి, సీనియర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఒత్తిడి పరిస్థితుల్లో జట్టు స్కోరును 130 లేదా 140 పరుగులకు తీసుకెళ్లాలని అనుకున్నామని.. అయితే, చివరికి 150 పరుగుల మంచి స్కోరు సాధ్యమైందని తెలిపాడు. మరోవైపు ఈ టోర్నీకి ముందు శ్రీలంక పర్యటన కూడా తనకు ఉపయోగపడిందని యువ బ్యాట్స్‌మన్ వివరించాడు. తొలుత బంతి బాగా స్వింగ్ అయిందని, అలాంటప్పుడు తాను స్పిన్నర్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పాడు. జడేజా క్రీజులోకి వచ్చాక తాను అవకాశం తీసుకుని స్వేచ్ఛగా ఆడానని రుతురాజ్ వివరించాడు.