
Virat Kohli - Rohit: ఫామ్‌లో కోహ్లీ.. రోహిత్‌తో ఓపెనింగ్
ఇంటర్నెట్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, దీంతో ఓపెనర్‌గా తన బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తూ ఉండొచ్చని మాజీ బ్యాట్స్‌మన్ సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అతడు రాబోయే టీ20 ప్రపంచకప్‌లోనూ టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘చూస్తుంటే కోహ్లీ ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్‌తో కలిసి ఓపెనింగ్ చేసేలా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో అతడు ఆడుతున్న తీరు చూసి మురిసిపోతున్నట్లు అనిపిస్తోంది. రెండు వరుస మ్యాచ్‌ల్లో అర్ధశతకాలు సాధించాడు’ అని మాజీ బ్యాట్స్‌మన్ పేర్కొన్నాడు.
ఈ సీజన్లో కోహ్లీ స్ట్రైక్‌రేట్ బాగుందని, ఆర్సీబీ ఓపెనర్‌గా రావడం మంచి పరిణామం అని సబా కరీమ్ మెచ్చుకున్నాడు. షాట్లు ఎలా ఆడాలి? రిస్క్ ఎలా తీసుకోవాలి? అన్న విషయాలు అతడికి తెలుసని చెప్పాడు. ప్రస్తుతం బెంగళూరు సారథి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకే కాకుండా టీమ్ఇండియాకు శుభసూచికమని వివరించాడు. అలాగే కోహ్లీ నుంచి అభిమానులు పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆశిస్తున్నారని తెలిపాడు. ఐపీఎల్లో ఓపెనర్‌గా దిగుతూ పవర్‌ప్లే అయిపోయేలోపు మంచి స్ట్రైకర్రేట్ ఉంటే తర్వాత భారీ ఇన్నింగ్స్ ఆడాలని మాజీ క్రికెటర్ సూచించాడు. ఇదిలా ఉండగా, ఇంతకుముందు విరాట్ సైతం ఇదే విషయాన్ని చెప్పాడు. ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో అభిమానులు సైతం కోహ్లీ-రోహిత్ కాంబినేషన్ చూడాలని ఎదురు చూస్తున్నారు.