
Tokyo Paralympics: పారా అథ్లెట్లే నిజమైన హీరోలు: సచిన్
ఇంటర్నెట్‌డెస్క్: టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత అథ్లెట్ల బృందానికి దేశ ప్రజలు అండగా నిలవాలని, వారే నిజమైన హీరోలని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ పేర్కొన్నాడు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది ప్రత్యేక అవసరాల అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే సచిన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసి ఇలా రాసుకొచ్చాడు. ఈ అథ్లెట్లు పాషన్, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని సామాన్య ప్రజలకు కనువిప్పు కలిగిస్తారన్నాడు. వీళ్లు ప్రత్యేక అవసరాలు కలిగిన అథ్లెట్లు కాదని, అత్యద్భుత శక్తి కలిగిన అథ్లెట్లని కొనియాడాడు.
ఒలింపిక్స్ పతక విజేతలు, క్రికెటర్లను మనం ఎలాగైతే సత్కరించి గౌరవిస్తామో.. అలాగే వీరిని కూడా ప్రోత్సహిస్తే మన సమాజం మరింత మెరుగవుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అలా కేవలం పారాలింపిక్స్‌లో పతకాలు సాధించేవారిని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కిరినీ గౌరవించాలని సూచించాడు. అలాగే ఈ ఒలింపిక్స్‌లో భారత్ కనీసం పది పతకాలు సాధిస్తుందనే నమ్మకం ఉందన్నాడు. గత రియో పారాలింపిక్స్‌లో భారత్ నాలుగు పతకాలు సాధించిందని, ఆ సంఖ్య ఇప్పుడు పదికి చేరాలని క్రికెట్ దిగ్గజం అభిలాషించాడు. ఇందులో ఎవరు పతకాలు గెలిచినా గెలవకపోయినా తాను ప్రతి ఒక్కరి ఆటను సమానంగా చూస్తాన్నాడు. అక్కడ పాల్గొనే ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకులని ప్రశంసించాడు. అలాగే వీరిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులు కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నాడు.