Sachin Tendulkar: సచిన్‌ @ 30,000.. @ పుష్కరకాలం పూర్తి

సచిన్‌ తెందూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అత్యధిక పరుగుల (34,347) వీరుడిగా అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడిలానే టీమ్‌ఇండియా...

Published : 20 Nov 2021 22:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సచిన్‌ తెందూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అత్యధిక పరుగుల (34,347) వీరుడిగా అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడిలానే టీమ్‌ఇండియా తరఫున పరుగుల వరద పారిస్తున్న విరాట్‌ కోహ్లీ ఆ రికార్డును చేరాలంటే మరింత దూరం ప్రయాణించాలి. ప్రస్తుతం విరాట్‌ మూడు ఫార్మాట్లలో కలిపి 23,161 పరుగులతో ఉన్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 30 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్‌గా సచిన్‌ కొనసాగుతున్నాడు. కాగా, ఈ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ చేసిన పరుగులన్నీ టెస్టు, వన్డే క్రికెట్‌లోనే కావడం విశేషం. టీ20ల్లో ఈ మాజీ కెప్టెన్‌ ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడి 10 పరుగులే చేశాడు. అయితే, అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో 30 వేల పరుగులు పూర్తి చేసుకుంది ఈరోజే. అంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2009 నవంబర్‌ 16-20 తేదీల మధ్య మొతేరా వేదికగా శ్రీలంకతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో శతకం సాధించి ఆ ఘనత నమోదు చేశాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 426 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ ద్రవిడ్‌ (177; 261 బంతుల్లో 26x4, 1x6), కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (110; 159 బంతుల్లో 10x4, 1x6) శతకాలతో మెరిశారు. అనంతరం లంక తొలి ఇన్నింగ్స్‌లో 760/7 స్కోర్‌ సాధించి నాలుగో రోజు చివరి సెషన్‌ ముందు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. మహేలా జయవర్దెనె (275; 435 బంతుల్లో 27x4, 1x6) భారీ ద్విశతకానికి తోడు తిలకరత్నె దిల్షాన్‌ (112; 133 బంతుల్లో 12x4), ప్రసన్న జయవర్దెనె (154; 314 బంతుల్లో 11x4) శతకాలతో రాణించారు. దీంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ను గెలిచే పరిస్థితి లేక డ్రా చేసుకుంది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ చివరికి 412/4 స్కోర్‌ సాధించింది. ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (114; 230 బంతుల్లో 13x4), సచిన్‌ (100 నాటౌట్‌; 211 బంతుల్లో 11x4) శతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే మాస్టర్‌బ్లాస్టర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 30 వేల పరుగుల మైలురాయి చేరుకోవడమే కాకుండా కెరీర్‌లో 88వ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ తర్వాత సచిన్‌ మరో నాలుగేళ్లు టీమ్‌ఇండియాకు సేవలందించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని