Sachin Tendulkar: మన బౌలింగ్‌ చూసి ఇంగ్లాండ్‌ భయపడిందని అప్పుడే అర్థమైంది: సచిన్

టీమ్‌ఇండియాతో ఆడిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌ చేయడానికి భయపడిందని మాజీ కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన పీటీఐకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు...

Published : 18 Aug 2021 01:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో ఆడిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌ చేయడానికి భయపడిందని మాజీ కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన పీటీఐకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లతో పాటు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలపైనా స్పందించారు. ఈ క్రమంలోనే రెండో టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేయడానికి ఆందోళన చెందిందని అన్నారు.

మీరెన్నో చిరస్మరణీయమైన విజయాల్లో పాలుపంచుకున్నారు. ఈ లార్డ్స్‌ టెస్టు విజయాన్ని ఎలా వర్ణిస్తారు?

సచిన్‌: ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించినప్పుడే నేను ఆశ్చర్యపోయాను. అలా చేయడంతోనే టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ను చూసి ఆ జట్టు భయపడిందని అనుకున్నాను. ఈ విషయంపై శుక్రవారం ఉదయం నా మిత్రుడొకరికి మెసేజ్‌ చేశాను. వాతావరణం అనుకూలిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తుందని చెప్పాను. ఎందుకంటే మ్యాచ్‌ జరిగేకొద్దీ ఈ పిచ్‌ చాలా పొడిగా అనిపించింది. సిరాజ్‌ కొత్త బంతితో రాబిన్‌సన్‌కు బౌలింగ్‌ చేసినప్పుడు బంతి వెళ్లి ఛాతికి తగిలింది. పిచ్‌ డ్రైగా మారిందనడానికి అదే నిదర్శనం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తొలుత బౌలింగ్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. అలాగే మన ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ అద్భుతంగా ఆడారు.

❓ ఈ ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ గురించి మీరేమంటారు?

సచిన్‌: ఈ ఇంగ్లాండ్‌ జట్టుకు ఒక్కసారిగా కుప్పకూలే చరిత్ర ఉంది. అక్కడే వాళ్లు వెనుబడ్డారు. ఈ జట్టులో ఎంత మంది బ్యాట్స్‌మెన్‌ శతకాలు సాధిస్తారని కచ్చితంగా చెప్పగలరు? నేనైతే జోరూట్‌ మినహా ఎవరినీ ఎంపికచేయలేను. ఇదివరకున్న జట్లలో అలిస్టర్‌ కుక్‌, మైఖేల్‌ వాన్‌, కెవిన్‌ పీటర్సన్‌, ఇయాన్‌ బెల్‌, జోనాథన్‌ ట్రాట్‌, ఆండ్రూ స్ట్రాస్‌ లాంటి ఆటగాళ్లు బాగా ఆడేవాళ్లు. ఇప్పుడున్న జట్టులో ఎప్పుడో ఒకసారి శతకాలు బాదినా నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరున్నారు? అలా ఆడేవారిలో రూట్ మినహా ఎవరూ కనిపించరు. ఇప్పుడా జట్టు పరిస్థితి ఇలా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో రూట్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోడానికి ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌పై మీ స్పందన? అలాగే అతడు తరచూ హుక్‌ లేదా పుల్‌ షాట్లకు ఔటవ్వడాన్ని ఎలా చూస్తారు?

సచిన్‌: నేను ఏదైతే చూసానో అదే నమ్ముతా. రోహిత్‌ చాలా అద్భుతంగా ఆడాడు. తన బ్యాటింగ్‌ టెంపర్మెంట్‌లోని మరో కోణాన్ని చూపించాడు. పరిస్థితులకు తగ్గట్టు తనని తాను ఎలా మలుచుకుంటాడో కూడా చాటిచెప్పాడు. మరోవైపు అతడికి రాహుల్‌ నుంచి కూడా మంచి సహకారం అందింది. ఇక పుల్‌ షాట్ల విషయానికొస్తే ఇదివరకే అలాంటి షాట్లతో బౌండరీలు సాధించాడు. బంతిని ఎలా ఆడాలి, ఎలా వదిలేయాలనే విషయాలపైనా మంచి నైపుణ్యం సాధించాడు. అలాగే ఇంగ్లాండ్‌లో ఇటీవల అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే కచ్చితంగా అనుకున్న దానికన్నా పై స్థాయిలోనే ఉన్నాడు.

పుజారా, రహానె శతక భాగస్వామ్యాన్ని ఎలా అంచనా వేస్తారు? ఆ సమయంలో వాళ్లపై ఒత్తిడి ఉండటంతో స్కోరింగ్‌ రేట్‌ తగ్గిందని భావిస్తారా?

సచిన్‌: రెండో ఇన్నింగ్స్‌లో వాళ్లిద్దరూ చాలా కీలకమైన పాత్ర పోషించారు. వాళ్లు క్రీజులోకి వచ్చేటప్పటికి భారత్‌ చాలా తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో మరో రెండు వికెట్లు కూడా పడి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కానీ, వాళ్ల బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. జట్టుకు మంచి చేయాలనేదే వారి ఆలోచన. అందుకు తగ్గట్టే ఆడారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రతి ఒక్క బ్యాట్స్‌మన్‌ రాణించాలనుకుంటాం. కానీ, ఎల్లప్పుడూ అది సాధ్యంకాదు.

విరాట్‌ కోహ్లీ ఇటీవల సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అది టెక్నికల్‌ సమస్యా లేక ఆలోచనా విధానం తప్పా?

సచిన్‌: ఇప్పటివరకు కోహ్లీకి మంచి ఆరంభం దక్కలేదు. అయితే, ఇక్కడ ఆలోచనా విధానమే టెక్నికల్‌ సమస్యలకు దారి తీస్తుంది. ఎవరైనా మొదట్లో సరిగ్గా ఆడకపోతే తర్వాత అనేక విషయాలపై ఆలోచిస్తారు. ఎందుకంటే బ్యాట్స్‌మన్‌పై మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒక బ్యాట్స్‌మన్‌ ఫామ్‌లో లేకపోతే ఆట నుంచి పక్కకు తప్పుకోవాలి. లేదా ఆడుతున్న విధానానికే కట్టుబడి ఉండాలి. ఇది ఎవరికైనా జరిగేదే. అయితే, ఫామ్‌లో ఉండటం అనేది కూడా బ్యాట్స్‌మన్‌ ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు శరీరం కూడా సహకరించాలి.

ఇప్పుడున్న టీమ్‌ఇండియా బౌలింగ్‌ యూనిట్‌ గత బౌలర్ల కంటే ఎలా ప్రత్యేకం?

సచిన్‌: ఈ టీమ్ఇండియా బౌలింగ్‌ యూనిట్‌ ప్రపంచంలోనే మేటిది. ఇది ఆటగాళ్ల నైపుణ్యం, అంకితభావం, ఫిట్‌నెస్‌కు నిదర్శనం. అలాగే నేను పాత తరం క్రికెటర్లతో పోల్చిచూడటాన్ని ఇష్టపడను. ఎందుకంటే ఏ బౌలర్లను అలా పోల్చి చూసినా వాళ్లపై బ్యాటింగ్‌ చేసిన బ్యాట్స్‌మెన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కపిల్‌, శ్రీనాథ్‌, జహీర్‌ ఇలా ఎవరైనా వారిపై ఆడిన బ్యాట్స్‌మన్‌ను పోల్చాలి.

బుమ్రా కొంత కాలంగా సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు ఉన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పోలిస్తే ఒక్కసారిగా ఎలా మారాడు?

సచిన్‌: టెస్టు ఛాంపియన్‌షిప్‌ కన్నా ముందు బుమ్రాకు సరైన లాంగ్‌ స్పెల్స్‌ బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదని నేను అనుకుంటున్నా. అతడు బౌలింగ్‌ చేసే కొద్దీ మెరుగయ్యే బౌలర్‌. అలాగే అతడు చాలా పెద్ద మనసున్న బౌలరే కాకుండా తెలివైన వాడు కూడా. రాబిన్‌సన్‌ను తొలుత కొన్ని షార్ట్‌ బాల్స్‌తో ఆడించి ఒక్కసారిగా స్లో బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

మహ్మద్‌ సిరాజ్‌ స్వల్ప కెరీర్‌లోనే ప్రత్యేకంగా ఏమి అనిపించింది?

సచిన్‌: సిరాజ్‌ ఏదైనా త్వరగా నేర్చుకుంటాడు. అలాగే పరిస్థితులకు అలవాటు పడతాడు. ఫాస్ట్‌ బౌలర్లు ఎవరైనా చాలా త్వరగా పరిస్థితులకు తగ్గట్టు మారే అవకాశం ఉంటుంది. వాళ్లని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రస్తుతం సిరాజ్‌ కూడా అలాంటి దశలోనే ఉన్నాడు. ఇప్పటివరకు చాలా వేగంగా మెరుగయ్యాడు. గతేడాది ఎంసీజీ టెస్టుతో ఇప్పటి సిరాజ్‌ను పోల్చి చూస్తే.. అతడు బాగా రాణిస్తున్నాడు. అనేక విషయాల్లో ఆరితేరాడు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వంద శాతం తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని