Virat Kohli : కోహ్లీని టెస్టు కెప్టెన్‌గానూ తప్పిస్తే.. విభేదాలున్నాయని స్పష్టమవుతుంది

టీమ్‌ఇండియా టెస్టు సారథిగానూ విరాట్‌ కోహ్లీని తొలగించి రోహిత్‌ శర్మకే ఆ బాధ్యతలు అప్పగిస్తే మంచిదికాదని పాకిస్థాన్‌ మాజీ సారథి సల్మాన్‌ బట్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 20 Dec 2021 10:10 IST

పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు సారథిగానూ విరాట్‌ కోహ్లీని తొలగించి రోహిత్‌ శర్మకే ఆ బాధ్యతలు అప్పగించడం మంచిదికాదని పాకిస్థాన్‌ మాజీ సారథి సల్మాన్‌ బట్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జట్టు యాజమాన్యం కోహ్లీని వన్డే సారథిగా తప్పించి హిట్‌మ్యాన్‌కి పగ్గాలందించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా.. అక్కడ తొలిసారి టెస్టు సిరీస్‌ సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం బ్యాట్స్‌మన్‌గా, సారథిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతడు ఏ ఒక్క విషయంలో విఫలమైనా.. తర్వాత టెస్టుల నుంచి కూడా సారథిగా వైదొలిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘టెస్టు సారథిగానూ కోహ్లీని తప్పించి పూర్తిగా జట్టు పగ్గాలు రోహిత్‌కే అప్పగించాలని భావిస్తే అది సరైన నిర్ణయం కాదు. అలా చేస్తే వారిద్దరూ ఇకపై ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ది ఫీల్డ్‌లో.. ఎక్కడా కలిసి ఉండరనే విషయం స్పష్టమవుతుంది. అలా జరగాలని నేను అనుకోను. టెస్టు సారథిగా కోహ్లీని తప్పించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అది జరుగుతుందో లేదో నాకూ తెలియదు. అయితే, అలా జరిగితే.. రోహిత్‌, కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని అర్ధమవుతుంది. భారత్‌ తరఫున విదేశాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కోహ్లీని టెస్టు కెప్టెన్‌గా తొలగించడానికి ఎలాంటి కారణం లేదు. ఈ దక్షిణాఫ్రికా సిరీస్‌ ఒక్కటే అతడి కెప్టెన్సీపై భారం కాకూడదు. ఒకవేళ అది జరిగితే టీమ్‌ఇండియాకు మంచిదికాదు’ అని సల్మాన్‌బట్‌ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు టీమ్‌ఇండియా ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఆ లోటు పూడ్చాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి విదేశీ గడ్డలపై ఆధిపత్యం చెలాయించిన కోహ్లీసేన.. ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం పెద్ద కష్టమేంకాదనే వాదన బలంగా వినిపిస్తోంది.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని