Team India: ధోనీ ఉన్నప్పటి నుంచే ఈ పద్ధతి కొనసాగుతోంది: సల్మాన్‌ బట్‌

దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టును శనివారం ప్రకటించగా కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం గాయం...

Published : 02 Jan 2022 09:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టును శనివారం ప్రకటించగా కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం గాయం కారణంగా ఈ పర్యటనకు దూరంగా ఉండటంతో అంతా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీనే కొనసాగిస్తారని ఆశించారు. కానీ, జట్టు యాజమాన్యం వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించి ఆశ్చర్యపర్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్‌ బట్‌ తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ కోహ్లీకి వన్డే సారథ్య బాధ్యతలు అప్పగించకపోవడంపై స్పందించాడు. ఈ పద్ధతి ధోనీ నాయకుడిగా ఉన్న రోజుల నుంచే కొనసాగుతుందని వెల్లడించాడు.

‘విరాట్‌ ఇకపై పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టడు. దీంతో జట్టు యాజమాన్యం వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌నే స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌గా నియమించింది. అతడికి ఐపీఎల్‌లో నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే టీమ్‌ఇండియాలో ఈ పద్ధతి కొనసాగుతోంది. అవకాశం ఉన్నప్పుడల్లా ఆ జట్టు యాజమాన్యం యువకులకు బాధ్యతలు అప్పగించి జట్టును ఎలా నడిపిస్తారో పరీక్షించేది. ధోనీ సారథిగా ఉన్నప్పుడు చిన్న జట్లపై ఆడేటప్పుడు ఇతరులకు కెప్టెన్సీ ఇచ్చేవాడు. అప్పుడు ఆ జట్టు విజయాలు కూడా సాధించేది. ఇప్పుడైతే రాహుల్‌కు ఇది మంచి అవకాశం’ అని పాక్‌ మాజీ ఓపెనర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని