Jarvo69: మళ్లీ పిచ్‌ వద్దకెళ్లిన జార్వో.. అరెస్టు చేసిన పోలీసులు

భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తున్న యూట్యూబర్‌ డేనియెల్‌ జార్విస్‌ (జార్వో 69)ను లండన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశిస్తున్నాడు..

Updated : 05 Sep 2021 02:24 IST

లండన్‌: భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తున్న యూట్యూబర్‌ డేనియెల్‌ జార్విస్‌ (జార్వో 69)ను లండన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఓవల్‌ మ్యాచులోనూ అతడిలాగే ప్రవర్తించడంతో లండన్‌ దక్షిణ విభాగం పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది.

‘జార్వో 69’ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించే డేనియెల్‌ ఇప్పటి వరకు మూడుసార్లు మైదానంలోకి ప్రవేశించాడు. అతడు టీమ్‌ఇండియా జెర్సీని ధరించి వస్తున్నాడు. లార్డ్స్‌లో ఫీల్డర్లను మోహరిస్తూ కనిపించాడు. ఇక లీడ్స్‌లో రోహిత్‌ శర్మ ఔటవ్వగానే బ్యాటు పట్టుకొని పిచ్‌ వద్దకు వచ్చాడు. దాంతో అతడిని హెడింగ్లే స్టేడియంలోకి రాకుండా శాశ్వతంగా నిషేధించారు.

ఇక ఓవల్‌ టెస్టు రెండోరోజు భోజన విరామానికి ముందు జార్వో పిచ్‌ వద్దకు వచ్చాడు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌ చేస్తుండగా వెనక నుంచి పరుగెత్తుకొచ్చాడు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోను పట్టుకొన్నాడు. దాంతో బెయిర్‌స్టో అసహనానికి గురయ్యాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న ఒలీ పోప్‌ తన ఏకాగ్రత చెదిరిపోయిందని ఫిర్యాదు చేశాడు. జార్వోను బయటకు తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది మళ్లీ కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడిని లండన్‌ దక్షిణ విభాగం పోలీసులు అరెస్టు చేశారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

పదేపదే ఒకే వ్యక్తి మైదానంలోకి ప్రవేశిస్తున్నా ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం కఠినచర్యలేమీ తీసుకోవడం లేదు. ప్రస్తుతానికి బీసీసీఐ వర్గాలు దీనిపై అధికారికంగా ఫిర్యాదేమీ చేయలేదు. అయితే ఆటగాళ్ల భద్రత మాటేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని