T20 World Cup: మలింగ రికార్డునే బద్దలు కొట్టిన షకిబ్‌ అల్‌ హసన్

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ టీ20 క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును తిరగరాశాడు...

Updated : 18 Oct 2021 13:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ టీ20 క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును తిరగరాశాడు. గతరాత్రి స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ బంగ్లా స్పిన్నర్‌ రెండు వికెట్లు తీసి పొట్టి క్రికెట్‌లో మొత్తం 108 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ జాబితాలో మలింగ(107 వికెట్లు) రికార్డును అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. స్కాట్లాండ్‌ను 140/9 పరుగులకే పరిమితం చేసింది. ఈ సందర్భంగా షకిబ్‌ నాలుగు ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తొలుత 11వ ఓవర్‌లో బెర్రింగ్టన్‌(2)ను పెవిలియన్‌ పంపిన అతడు మరో రెండు బంతుల తర్వాత లీస్క్‌(0)ను డకౌట్‌ చేశాడు. ఈ క్రమంలోనే మలింగని అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు. కాగా, శ్రీలంక మాజీ పేసర్‌ 84 టీ20 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు పడగొట్టగా షకిబ్‌ 89 మ్యాచ్‌ల్లో ఆ ఘనత సాధించాడు. మరోవైపు ఈ ఫార్మాట్‌లో వందకుపైగా వికెట్లు తీసి, వెయ్యి పరుగులకు పైగా సాధించిన ఏకైక ఆటగాడిగా ఈ బంగ్లా ఆల్‌రౌండర్‌ కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ విజయం సాధించడం విశేషం. 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 20 ఓవర్లలో 134/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో 6 పరుగులతో ఓటమిపాలై తొలి క్వాలిఫయర్‌లోనే విఫలమైంది. బంగ్లా చివరి ఓవర్‌లో 24 పరుగులు అవసరం కాగా మెహదీ హసన్‌ (13), సైఫుద్దీన్‌ (5) రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది మొత్తం 17 పరుగులు రాబట్టారు. చివరి బంతికి ఏడు పరుగులు అవసరం కాగా మెహది సింగిల్‌ తీయడంతో స్కాట్లాండ్‌ విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని