Injury scare for India vs England : రెండో టెస్టు ముందు రెండు జట్లకు షాకులు!

రెండో టెస్టుకు ముందు భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లకు వరుస షాకులు తగిలాయి! ఇంగ్లాండ్‌ ప్రధాన పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌, టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ గాయపడ్డారు....

Updated : 11 Aug 2021 13:43 IST

గాయపడ్డ ఆటగాళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో టెస్టుకు ముందు భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లకు వరుస షాకులు తగిలాయి! ఇంగ్లాండ్‌ ప్రధాన పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌, టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ గాయపడ్డారు. వీరిద్దరూ లార్డ్స్‌ టెస్టు ఆడటం కష్టమేనని తెలుస్తోంది. బ్రాడ్‌ బదులు మార్క్‌వుడ్‌, శార్దూల్‌ స్థానాన్ని ఇషాంత్‌ శర్మ భర్తీ చేస్తారని సమాచారం.

మంగళవారం సాధన చేస్తుండగా స్టువర్ట్‌ బ్రాడ్‌ కాలి మడమ మలుచుకుందని అంటున్నారు. గాయం తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. అతడు లేచి నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడిని వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటి వరకు బ్రాడ్‌ 149 టెస్టులు ఆడాడు. లార్డ్స్‌లో 150వ మ్యాచ్‌ ఆడి కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని అతడు భావించాడు. అతడు ఈ టెస్టు ఆడతాడా లేడా అన్నది బుధవారం సాయంత్రం తెలియనుంది. గాయం తీవ్రంగా ఉందని, పూర్తి సిరీసుకు దూరమైనా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు.

శార్దూల్‌ ఠాకూర్‌ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని తెలిసింది. మంగళవారం సాధన చేసేటప్పుడు కండరాలు పట్టేశాయని అంటున్నారు. అతడి గాయం తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారమైతే లేదు. ఆడలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ పునరాగమనం చేస్తాడు. తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని శార్దూల్‌ను తీసుకున్నారు. పేస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం అతడి సొంతం. ఇంగ్లాండ్‌లో నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌ కూర్పుతో ఆడతామని కోహ్లీ ఇంతకు ముందే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో యాష్‌కు చోటు దక్కడం కష్టమేనని అనిపిస్తోంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని