
Mohammed Siraj: సిరాజ్ ష్..! సంబరాలు అనవసరం.. అలా చేయొద్దు
లండన్: తొలి టెస్టులో జానీ బెయిర్‌స్టో ఔటైనప్పుడు మహ్మద్ సిరాజ్ ష్..! అంటూ చేసుకున్న సంబరాలు అనవసరమని వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగే కొద్దీ అతడు ఇవన్నీ నేర్చుకుంటాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ను ఓడించేందుకే టీమ్‌ఇండియా బ్రిటన్‌లో పర్యటిస్తోందని వెల్లడించాడు.
తొలి టెస్టులో సిరాజ్ దూకుడుగా ప్రవర్తించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై కొన్నిసార్లు మాటల దాడికి దిగాడు. అంతేకాకుండా బెయిర్ స్టో ఔటవ్వగానే ష్..! అంటూ సైగలు చేస్తూ అతడికి పెవిలియన్ దారి చూపించాడు.
‘సిరాజ్ అలా చేయడం అనవసరం. అప్పటికే యుద్ధం గెలిచావ్! మళ్లీ అలా రెచ్చగొట్టడం ఎందుకు? అంతర్జాతీయ కెరీర్లో ఎదిగే క్రమంలో అతడు ఇవన్నీ నేర్చుకుంటాడు. టీమ్‌ఇండియా సభ్యుడిని శాంతింపజేసేందుకు విరాట్ కోహ్లీ ఎన్నిసార్లు బరిలోకి దిగాడో మనం ఊహించుకోవచ్చు. అలాంటిది సిరాజ్ గీత దాటకుండా ఉండేందుకు కోహ్లీ వెంటనే రంగంలోకి దిగాడు’ అని దినేశ్ అన్నాడు.
‘ఇప్పటి టీమ్‌ఇండియా బ్రాండ్ క్రికెట్‌ను నేను ఇష్టపడతాను. ప్రత్యర్థులకు బదులిచ్చేందుకు ఎవ్వరూ వెనకడుగు వేయడం లేదు. సిరాజ్, కేఎల్ రాహుల్ అలా చేయడం చూశాం. ఇది సరికొత్త భారత్. తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేందుకు అనుమతి లభించింది’ అని డీకే అన్నాడు. కాగా దూకుడు అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని అతడు పేర్కొన్నాడు.
‘విరాట్, సిరాజ్, రాహుల్ బహిరంగంగా, ముఖం పైనే బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. సీనియర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, పుజారా, అజింక్య రహానె ఆ దారిలో నడవరు. అయితే వారిలో దూకుడు లేదనుకోవద్దు. విచిత్రంగా టీమ్‌ఇండియా పేసర్లు భౌతికంగా దూకుడు ప్రదర్శించరు. బంతితో తమ పని జరిగితే చాలన్నట్టు ఉంటారు. ఇక విదేశాల్లో టీమ్‌ఇండియా రాణించేందుకు విరాట్ కోహ్లీ దూకుడు, బౌలర్ల దాడే కారణం. ఇప్పటికే ఆస్ట్రేలియాను రెండుసార్లు ఓడించారు. ఇప్పుడు ఇంగ్లాండ్ పని పడతారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సంగతి చూస్తారు. వారిలో ఆ ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది’ అని డీకే అన్నాడు.