New Zealand Cricket: న్యూజిలాండ్‌ మహిళల జట్టుకు బాంబు బెదిరింపులు

పాకిస్థాన్‌ పర్యటనకు ముందే తమ క్రికెటర్లలో కొందరికి చావు బెదిరింపులు వచ్చాయని న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ హీత్‌ మిల్స్‌ వెల్లడించారు...

Updated : 21 Sep 2021 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్‌ మహిళల జట్టుకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించిందని కివీస్‌ బోర్డు ప్రకటించింది. అయితే, ఈ బెదిరింపులపై తమ భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని.. అవి ఉత్తుత్తివేనని స్పష్టం చేసింది. మహిళల క్రికెటర్లు బస చేసే హోటల్‌తో పాటు స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు పెడతామని ఈసీబీకి ఈమెయిల్‌ వచ్చినట్లు సమాచారం అందింది.

మరోవైపు పాకిస్థాన్‌ పర్యటనకు ముందే తమ పురుషుల జట్టులోని కొందరిని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ హీత్‌ మిల్స్‌ వెల్లడించారు. తొలుత అవి సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని చెప్పారు. వాటిపై దర్యాప్తు చేసిన తమ భద్రతా నిపుణులు ఆ బెదిరింపులు ఉత్తివేనని తేల్చారన్నారు.

గత శుక్రవారం న్యూజిలాండ్‌ జట్టు పాకిస్థాన్‌లో ఆఖరి నిమిషంలో టోర్నీని రద్దు చేసుకొని అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లిపోయింది. దీనిపై వెంటనే స్పందించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు.. న్యూజిలాండ్‌పై ఐసీసీలో ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది. దీనిపై మాట్లాడిన మిల్స్‌ తమ బోర్డు ఈ విషయంలో ఎలాంటి అతి చేయలేదని చెప్పాడు. తమ ఆటగాళ్లు అక్కడ ఉన్నన్ని రోజులు పాక్‌ బలగాలు బాగా పనిచేశాయని, తాము వారి పనితీరును శంకించడం లేదని వివరించాడు. కానీ, ఆ దేశంలో తమ ఆటగాళ్లు ఉండే పరిస్థితి లేదన్నాడు. ఇలా అర్ధాంతరంగా పాక్ పర్యటనను రద్దు చేసుకోవడం మంచిది కాదని తెలిసినా ఆటగాళ్ల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అక్కడి నుంచి బయటపడటంతో న్యూజిలాండ్‌ క్రికెటర్లు ఉపశమనం పొందారన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని