
AB devilliers: ‘వాళ్లకు అన్యాయం చేయలేక.. డివిలియర్స్‌ను ఎంపిక చేయలేదు’
దక్షిణాఫ్రికా మాజీ సెలెక్టర్ లిండాజోండి
ఇంటర్నెట్‌డెస్క్: 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ను తీసుకోకపోవడానికి గల కారణాన్ని ఆ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ లిండాజోండి తాజాగా వెల్లడించారు. ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేయలేకే ఏబీడీని ఎంపిక చేయలేదన్నారు. డివిలియర్స్ కెరీర్‌లో మంచి స్థితిలో ఉండగా 34 ఏళ్లకే 2018 మేలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే, అతడు 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని చూశాడని తెలిసింది. ఈ క్రమంలోనే తిరిగి జట్టులోకి వస్తానంటే తానే ఒప్పుకోలేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ వివరించారు.
‘అప్పటి కెప్టెన్ ఫా డుప్లెసిస్ నా వద్దకు వచ్చి డివిలియర్స్ మళ్లీ ప్రపంచకప్ జట్టులో ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. నేను దానికి ఒప్పుకోలేదు. అప్పటికే ఎంపిక చేసిన ఆటగాళ్లకు అన్యాయం చేసినట్లు అవుతుందని వద్దన్నాను. అయితే, అతడు రిటైర్మెంట్ ప్రకటించేటప్పుడే నేను వద్దని చెప్పాను. ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచకప్‌లో తన సేవలు అవసరమని.. అది పూర్తయ్యాక రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించాను. కావాలంటే ఇతర సిరీస్‌లకు ఆడకుండా విశ్రాంతి తీసుకుంటానంటే ఆలోచిద్దామని కూడా చెప్పాను. కానీ, అతడు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు’ అని లిండా అసలు సంగతి బయటపెట్టారు. కాగా, ఆ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలే సాధించి మధ్యలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.