లంక సారథి, కోచ్‌ మధ్య వాగ్వాదం?

రెండో వన్డేలో ఓటమి శ్రీలంక కెప్టెన్‌, కోచ్‌ మధ్య వివాదానికి దారితీసిందా? మైదానంలో దసున్‌ శనక ఫీల్డింగ్‌ మోహరింపులు, వ్యూహాల అమల్లో లోపాలు మైక్‌ ఆర్థర్‌కు నచ్చలేదా? అందుకే అతడు ఓటమి తర్వాత అతిగా స్పందించాడా? ...

Published : 22 Jul 2021 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో వన్డేలో ఓటమి శ్రీలంక కెప్టెన్‌, కోచ్‌ మధ్య వివాదానికి దారితీసిందా? మైదానంలో దసున్‌ శనక ఫీల్డింగ్‌ మోహరింపులు, వ్యూహాల అమల్లో లోపాలు మైక్‌ ఆర్థర్‌కు నచ్చలేదా? అందుకే అతడు ఓటమి తర్వాత అతిగా స్పందించాడా? సారథితో విభేదించి మైదానం నుంచి వెళ్లిపోయాడా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది!

టీమ్‌ఇండియాతో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 276 పరుగుల లక్ష్య ఛేదనలో గబ్బర్‌ సేన తడబడింది. 160కే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో దీపక్‌ చాహర్‌ (69*), భువనేశ్వర్‌ (19*) కలిసి జట్టుకు విజయం అందించారు. దాదాపుగా గెలిచే మ్యాచులో లంకేయులు ఓటమి పాలయ్యారు. 3 వికెట్లు తీసి ప్రమాదకరంగా మారిన హసరంగకు బంతి ఇవ్వకపోవడం, ఫీల్డింగ్‌ మోహరింపులో వైఫల్యం వారిని దెబ్బతీసింది. స్లిప్‌లో ఎక్కువ బౌండరీలు వెళ్లాయి.

మ్యాచ్‌ ముగిసిన వెంటనే శ్రీలంక కోచ్‌ మైక్‌ ఆర్థర్‌ ఆవేశంగా మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్‌ దసున్‌ శనకతో ఏదో మాట్లాడాడు. వారిద్దరూ ఒకర్నొకరు నిందించుకున్నట్టు కనిపించింది. ‘కోచ్‌, కెప్టెన్‌ మధ్య సంభాషణ మైదానంలో జరగాల్సింది కాదు. డ్రస్సింగ్‌ రూమ్‌లో అయితే మంచిది’ అని మాజీ క్రికెటర్‌ రసెల్‌ ఆర్నాల్డ్‌ ట్వీట్‌ చేశాడు.

‘రస్‌.. మేం గెలుపోటములను కలిసే స్వీకరిస్తాం. కానీ ప్రతిసారీ నేర్చుకుంటాం! నేను, దసున్‌ జట్టు ఎదుగుదల కోసం కృషి చేస్తున్నాం. విజయం సాధించకపోవడంతో మేమిద్దరం చిరాకు పడ్డాం! నిజానికి మేం అర్థవంతమైన చర్చే జరిపాం. ఇందులో అనుమానాలకు తావులేదు’ అని ఆర్థర్‌.. ఆర్నాల్డ్‌కు బదులిచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని