Muthiah Muralitharan: ప్చ్‌..! గెలుపు దారులు మరిచిన లంక

శ్రీలంక జట్టు గెలవడం మరిచిపోయిందని ఆ జట్టు మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌ గడ్డు దశలో ఉందని పేర్కొన్నాడు. కుర్రాళ్లలో అనుభవ రాహిత్యం కనిపిస్తోందని వెల్లడించాడు....

Published : 22 Jul 2021 01:25 IST

కొలంబో: శ్రీలంక జట్టు గెలవడం మరిచిపోయిందని ఆ జట్టు మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌ గడ్డు దశలో ఉందని పేర్కొన్నాడు. కుర్రాళ్లలో అనుభవరాహిత్యం కనిపిస్తోందని వెల్లడించాడు. రెండో వన్డేలో టీమ్‌ఇండియా విజయం తర్వాత అతడు మాట్లాడాడు.

‘నేను మీకు ముందే చెప్పా! ఎలా గెలవాలో శ్రీలంకకు తెలియదు. కొన్నేళ్లుగా ఆ జట్టు గెలుపుదారులు మర్చిపోయింది. గెలవడం రాని జట్టుతో కష్టమే’ అని ముత్తయ్య అన్నాడు.

వనిందు హసరంగ 3 వికెట్లు తీయడంతో టీమ్‌ఇండియా 35.1 ఓవర్లకు 193/7తో ఇబ్బంది పడింది. అలాంటి సమయంలో హసరంగను ఆఖరి ఓవర్ల కోసం ఉంచడం కెప్టెన్‌ దసున్‌ శనక తప్పిదమని ముత్తయ్య తెలిపాడు.

‘తొలి 10-15 ఓవర్లలో మూడు వికెట్లు తీస్తే టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతుందని నేను ముందే చెప్పాను. అన్నట్టే జరిగింది. కానీ దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఆ జట్టును రక్షించారు. లంక సైతం తప్పులు చేసింది. వికెట్ల కోసం ప్రయత్నించకుండా హసరంగను ఆఖరి ఓవర్ల కోసం అట్టిపెట్టుకుంది’ అని ముత్తయ్య పేర్కొన్నాడు.

‘భువీ, చాహర్‌లో ఎవరి వికెట్‌ తీసినా శ్రీలంకకు మేలు జరిగేది. ఎందుకంటే టెయిలెండర్లతో ఓవర్‌కు 8-9 పరుగులు చేయడం కష్టం. లంకేయులు తప్పు చేశారు. ఎందుకంటే వారిది అనుభవలేమి. కోచ్‌ మైక్‌ ఆర్థర్‌ ప్రశాంతంగా ఆటగాళ్లకు వివరిస్తే మంచిది. వికెట్లు తీస్తున్న బౌలర్‌కు బంతినివ్వాలని చెబితే బాగుండేది. ఏడు వికెట్లు పడ్డాయి. ఇంకొక్క వికెట్‌ తీస్తే విజయం లభించేంది. కానీ అలా జరగలేదు. చెప్పాను కదా.. లంక గెలవడం మర్చిపోయిందని’ అని ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని