
T20 World Cup: టీమ్‌ఇండియానే టైటిల్ ఫేవరెట్: స్మిత్
ఇంటర్నెట్‌డెస్క్: ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, దీంతో ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడానికి ఫేవరెట్‌గా అనిపిస్తుందని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ అభిప్రాయపడ్డాడు. బుధవారం రాత్రి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వార్మప్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఈనెల 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడేముందు పూర్తి ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం స్మిత్ మాట్లాడాడు.
‘టీమ్‌ఇండియా అద్భుతమైన జట్టు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అందులో అనేకమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అలాగే ఆ జట్టు ఆటగాళ్లంతా చాలా రోజులుగా ఇక్కడ ఐపీఎల్ ఆడారు. దీంతో ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది’ అని స్మిత్ అన్నాడు. అనంతరం తన బ్యాటింగ్‌పై స్పందించిన అతడు.. షాట్లు బాగా ఆడుతున్నట్లు చెప్పాడు. ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదని, అయితే.. నెట్స్‌లో బాగా సాధన చేశానని తెలిపాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్‌పై దృష్టి సారించి పరిస్థితులకు అలవాటు పడ్డానన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాప్ ఆర్డర్ డేవిడ్ వార్నర్ (1), కెప్టెన్ ఫించ్ (8), మిచెల్ మార్ష్ (0) విఫలమైన సంగతి తెలిసిందే. స్మిత్ (57), మాక్స్‌వెల్ (37), స్టాయినస్ (41) రాణించి జట్టు స్కోర్‌ను 152/5కి తీసుకెళ్లారు. అనంతరం టీమ్‌ఇండియా ఒక్క వికెటే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ (39), రోహిత్ శర్మ (60 రిటైర్డ్‌హర్ట్), సూర్యకుమార్ యాదవ్ (38) దంచికొట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.