AB de Villiers: యాష్‌కు చోటివ్వకపోవడంపై కోహ్లీకి ఏబీ అండ!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అండగా నిలిచాడు. జట్టు ఎంపికలో అతడి నిర్ణయాలను సమర్థించాడు....

Published : 07 Sep 2021 13:51 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అండగా నిలిచాడు. జట్టు ఎంపికలో అతడి నిర్ణయాలను సమర్థించాడు. నాలుగో టెస్టుకు ఆటగాళ్ల ఎంపిక, ఇతర అర్థంలేని విషయాల గురించి మర్చిపోవాలని భారత అభిమానులకు సూచించాడు. కోహ్లీసేన విజయాలను ఆస్వాదించాలని కోరాడు.

వరుసగా నాలుగో టెస్టులోనూ భారత జట్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కలేదు. ఓవల్‌లో యాష్‌కు మంచి రికార్డు ఉంది. అక్కడి పిచ్‌ అతడి బౌలింగ్‌కు నప్పుతుందని విశ్లేషకులు తెలిపారు. మ్యాచుకు ముందు అతడికి చోటు ఖాయమేనని భావించారు. కానీ విరాట్‌ మాత్రం అతడిని తీసుకోలేదు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ విధానాన్నే అనుసరించాడు. ఏకైక స్పిన్నర్‌గా జడ్డూకు తిరిగి అవకాశమిచ్చాడు. దీనిపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

‘టెస్టు క్రికెట్‌ అభిమానులుగా జట్టు ఎంపిక, అర్థంలేని విషయాల గురించి ఆందోళన చెందకండి. మీ కళ్లెదుట కనిపిస్తున్న పోటీ, అభిరుచి, నైపుణ్యాలు, దేశభక్తిని అభినందించండి. ఎందుకంటే మీరు మంచి ఆటను మిస్సవుతున్నారు!’ అని డివిలియర్స్‌ ట్వీట్‌ చేశాడు. ‘టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడింది. కోహ్లీ నాయకత్వం బాగుంది. కొంతమంది క్రికెటర్లు అసామాన్యమైన నైపుణ్యాలు, ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇంగ్లాండ్‌, రూట్‌ బాగానే ఆడారు! అందమైన ఆటకు ఈ మ్యాచ్‌ గొప్ప ప్రకటన! ఆఖరి పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని మరో ట్వీట్‌ పెట్టాడు.

ఐపీఎల్‌ రెండో దశ కోసం ఏబీడీ సోమవారం దుబాయ్‌లో అడుగుపెట్టాడు. మళ్లీ అందరినీ చూస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు. కొందరు ఇంగ్లాండ్‌లో ఉన్నారని, త్వరలోనే జట్టులో చేరతారని వెల్లడించాడు. త్వరగానే ఆర్‌సీబీ జోరు అందుకుంటుందని పేర్కొన్నాడు. ‘ఐపీఎల్‌కు నేను సిద్ధమవుతున్నా. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమిస్తున్నాను. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సంతరించుకొనేందుకు, బంతిని బాదేందుకు ప్రయత్నిస్తున్నాను. ఐసోలేషన్‌ ముగియగానే సాధన మొదలు పెడతాను’ అని ఏబీ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని