Surya Kumar Yadav: 65 రోజుల తర్వాత భార్యని కలిస్తే.. ఇలాంటి సంతోషమే!

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎట్టకేలకు తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకొని సంబరపడ్డాడు. సుమారు 65 రోజుల తర్వాత ఆమెను కలిసి లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు...

Published : 21 Aug 2021 01:25 IST

(Photo: Surya Kumar Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎట్టకేలకు తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకొని సంబరపడ్డాడు. సుమారు 65 రోజుల తర్వాత ఆమెను కలిసి లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ డ్యాన్స్‌ చేస్తూ కలియతిరిగారు. ఆ వీడియోను సూర్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో అభిమానులతో షేర్‌ చేసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. గతనెల శ్రీలంక పర్యటనకు ఎంపికైన సూర్యకుమార్‌ మేలోనే ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్లో రెండు వారాలు క్వారంటైన్‌లో ఉన్నాడు. తర్వాత లంక పర్యటనకు వెళ్లిన అతడు ఆపై ఇంగ్లాండ్‌లో పలువురు ఆటగాళ్లు గాయాలబారిన పడటంతో వారికి రీప్లేస్‌మెంట్‌గా అక్కడికి వెళ్లాడు.

ఈ క్రమంలోనే దేవిశాకు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పుడు ఆమె కూడా లండన్‌కు చేరుకోని, తన క్వారంటైన్‌ గడువును పూర్తి చేసుకుంది. తాజాగా తన భర్తను కలుసుకుంది. ఈ నేపథ్యంలోనే యువ జంట లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ నూతనోత్సాహంలో మునిగితేలారు. కాగా, సూర్యకుమార్‌ ఎన్నో రోజుల నుంచి ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా టీమ్‌ఇండియాకు ఇటీవలే ఎంపికయ్యాడు. తొలుత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికైన అతడు గతనెల శ్రీలంకలో తొలి అంతర్జాతీయ పర్యటనకు వెళ్లాడు. ఇప్పుడు శుభ్‌మన్‌గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ స్థానాల్లో పృథ్వీతో కలిసి అనూహ్యంగా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని