Suryakumar Yadav: సూర్యకుమార్‌ను వారిద్దరితో పోల్చడం సరికాదు: పాక్‌ మాజీ కెప్టెన్‌

 టీ20 ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి సిరీస్‌ను భారత్‌ తన ఖాతాలో వేసుకుంది.న్యూజిలాండ్‌తో జరిగిన...

Updated : 23 Nov 2021 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి సిరీస్‌ను భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసేసింది. నవంబర్‌ 25 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ను ఆడేందుకు సమయాత్తమవుతోంది. టీ20 సిరీస్‌ విజయంపై  మాజీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా నడిపారని కొనియాడారు. అయితే టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ సల్మాన్ భట్‌ సూచించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంకా మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాలని చెప్పాడు. త్వరలోనే సూర్యకుమార్‌ స్థిరత్వం అలవర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ కెప్టెన్సీ బాగుందని, అయితే టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ విఫలం కావడం కలవరపెట్టే అంశమని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ దీనివల్లే భారత్‌ సెమీస్‌కు చేరలేకపోయిందని గుర్తు చేశాడు.  

కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్ అర్ధశతకం‌, రిషభ్‌ పంత్ కీలక పరుగులు చేయడం మినహా.. మిగతా రెండు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేదని సల్మాన్‌ భట్ వివరించాడు. అదే సమయంలో పంత్‌, ఇషాన్‌ కిషన్‌లతో సూర్యకుమార్‌ను పోల్చకూడదని పేర్కొన్నాడు. ‘‘సూర్యకుమార్‌ ఇప్పుడు 30+ వయసులో ఉన్నాడు. ఎంతో పరిణితి చెందిన ఆటగాడు. చాలా దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. అతడిని ఇషాన్‌, రిషభ్‌ పంత్‌తో పోల్చడం సరికాదు. వారిద్దరు ఇంకా యువకులే. తక్కువ అనుభవం కలిగిన వారు’’ అని విశ్లేషించాడు. కాబట్టే సూర్యకుమార్‌ ఇంకా స్థిరంగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. అయితే దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని సల్మాన్‌ భట్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌ ముందు వరకు సూర్యకుమార్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ప్రపంచకప్‌లో జట్టులో స్థానం దక్కినా.. సద్వినియోగం చేసుకోలేకపోయాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో అర్ధశతకం (62) బాదిన సూర్యకుమార్‌.. మిగతా రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని