T20 World Cup: చూడు పంత్‌.. నాకింకా చాలా మంది కీపర్లు ఉన్నారు: కోహ్లీ

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్లతో చెలరేగాలని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ యువ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు స్పష్టం చేశాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలందించాలని కోరాడు...

Published : 16 Oct 2021 02:22 IST

ధోనీ తర్వాత అంతగొప్ప కీపర్‌ ఇంకా దొరకలేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్లతో చెలరేగాలని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ యువ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు సూచించాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలందించాలని కోరాడు. లేదంటే తనకు చాలా మంది కీపర్లు ఉన్నారని హెచ్చరించాడు. దీనికి స్పందించిన యువ బ్యాట్స్‌మన్‌, కీపర్‌.. అందుకు తగ్గట్టే తాను సన్నద్ధమవుతున్నానని చెప్పాడు. రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోర్నీ ప్రసార హక్కుదారులు తాజాగా ఓ సరదా యాడ్‌ రూపొందించారు. అందులో కోహ్లీ, పంత్‌ మధ్య ఇలాంటి సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో కోహ్లీ, పంత్‌ వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఇలా ముచ్చటించారు.

కోహ్లీ: పంత్‌.. టీ20ల్లో సిక్సులే మ్యాచ్‌లు గెలిపిస్తాయి.

పంత్‌: నువ్వేం కంగారు పడకు సోదరా.. నేను రోజూ ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఇంతకుముందు.. వికెట్ కీపరే టీమ్‌ఇండియాకు సిక్సర్‌ కొట్టి ప్రపంచకప్‌ గెలిపించాడు. (2011లో శ్రీలంకపై ధోనీని ఉద్దేశించి)

కోహ్లీ: నిజమే కానీ, ధోనీ భాయ్‌ తర్వాత టీమ్‌ఇండియాకు అంత గొప్ప వికెట్‌ కీపర్‌ ఇంకా దొరకలేదు.

పంత్‌: నేను కూడా టీమ్‌ఇండియా కీపరే..

కోహ్లీ: చూడు పంత్‌.. నాకు చాలా మంది కీపర్లు అందుబాటులో ఉన్నారు. వార్మప్‌ మ్యాచ్‌ల్లో ఎవరెలా ఆడుతారో చూద్దాం. అంటూ సరదాగా మాట్లాడుకున్నారు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌ యూఏఈలో నేటితో పూర్తవుతుంది. ఇక ఈనెల 17 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 18, 20వ తేదీల్లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లతో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆపై 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తొలిపోరులో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌ను మరింత ఎక్కువ మంది వీక్షించేందుకు ప్రసార హక్కుదారులు వినూత్న రీతిలో యాడ్‌లు రూపొందించారు. మరోవైపు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నేపథ్యంలోనూ రూపొందించిన మరో యాడ్‌ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని