Team India: అఫ్గానిస్థాన్‌పై టీమ్‌ఇండియా భారీ ఆశలు: అశ్విన్

టీమ్‌ఇండియా సెమీస్‌ చేరే విషయంపై జట్టులో ఎలాంటి చర్చలు జరగట్లేదని, తమ ధ్యాసంతా మిగిలిన మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలనే దానిపైనే ఉందని సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తెలిపాడు...

Published : 05 Nov 2021 08:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సెమీస్‌ చేరే విషయంపై జట్టులో ఎలాంటి చర్చలు జరగట్లేదని, తమ ధ్యాసంతా మిగిలిన మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలనే దానిపైనే ఉందని సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తెలిపాడు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన అతడు ఇకపై మిగిలిన మ్యాచ్‌ల్లో ఎలా రాణించాలనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో ప్రతి ఒక్కరూ తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోడానికి ఎదురుచూస్తున్నారని చెప్పాడు. ఎవరెలా ఆడతారనేది తమ చేతుల్లో లేదని, అయినా ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నట్లు అశ్విన్‌ వివరించాడు.

మరోవైపు టీమ్‌ఇండియా సెమీస్‌ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌.. న్యూజిలాండ్‌ను ఓడించాల్సినందున ఆ మ్యాచ్‌పై తాము భారీ ఆశలు పెట్టుకున్నట్లు చెప్పాడు. అఫ్గాన్‌ జట్టుకు యావత్‌ భారత అభిమానుల పూర్తి మద్దతు ఉంటుందన్నాడు. అఫ్గాన్‌ టీమ్‌ బాగా ఆడుతోందని.. కివీస్‌తో పోరు ఆసక్తిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ జట్టు న్యూజిలాండ్‌పై గెలవాలని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఇక నాలుగేళ్ల తర్వాత తాను టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి రావడం సంతోషంగా ఉందన్నాడు. ఈ మెగా టోర్నీలో రాణించాలని, జట్టుకు ఉపయుక్తమైన పాత్ర పోషించాలని కలలు కన్నట్లు చెప్పాడు. కాగా, టీమ్‌ఇండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో నిరాశ చెందానని, కానీ.. గత మ్యాచ్‌లో గెలవడంతో నూతనోత్తేజం కలిగిందని తెలిపాడు. భారత్‌ సెమీస్‌ చేరడానికి అన్నీ కలిసిరావాలని అశ్విన్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు