T20 World Cup: సెలబ్రేషన్స్‌లో ధోనీని కాపీ కొట్టిన అసిఫ్ అలీ

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకునేందుకు దగ్గరైంది. శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠపోరులో...

Updated : 31 Oct 2021 11:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకునేందుకు దగ్గరైంది. శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠపోరులో అద్భుత విజయం సాధించిన పాక్‌ జట్టు ప్రస్తుతం గ్రూప్‌-2లో టాప్‌లో నిలిచింది. అయితే, ఆ మ్యాచ్‌ అనంతరం పాక్‌ బ్యాట్స్‌మన్‌ అసిఫ్‌ అలీ టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీలా ‘గన్‌షాట్‌ సెలబ్రేషన్స్‌’ చేసుకోవడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ధోనీ భారత జట్టులో చేరిన కొత్తలో శ్రీలంకపై అద్భుత శతకం సాధించాక తన బ్యాట్‌తో గన్‌షాట్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై పలు సందర్భాల్లోనూ ఇలాగే సంబరాలు చేసుకున్నాడు.ఇప్పుడు అఫ్గాన్‌పై గెలిచాక అసిఫ్‌ కూడా అలాగే బ్యాట్‌ పైకెత్తి గన్‌తో షూట్‌ చేస్తున్నట్లు పోజులిచ్చాడు. దీంతో నెటిజన్లు వాళ్లిద్దరి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అసిఫ్‌ ఈ మ్యాచ్‌లో చివర్లో వచ్చి.. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన వేళ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సులు బాది పాకిస్థాన్‌కు అద్భుత విజయం అందించాడు. అతడు ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసి అఫ్గాన్‌తో ఘోర పరాభవాన్ని తప్పించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అనంతరం ధోనీలా సంబరాలు చేసుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో తలపడిన మ్యాచ్‌లోనూ అసిఫ్‌ (27; 12 బంతుల్లో 1x4, 3x6) చివర్లో ధాటిగా ఆడి పాకిస్థాన్‌ను గెలిపించాడు. ఇలా అతడు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిపించడంతో అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని